టెక్‌ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం 

27 Nov, 2021 02:06 IST|Sakshi

25 మంది విద్యార్థులు, ఐదుగురు అధ్యాపకులకు లక్షణాలు  

హోమ్‌ ఐసోలేషన్‌లో 1,700మంది

వర్సిటీకి సెలవు ప్రకటించిన యాజమాన్యం 

కుత్బుల్లాపూర్‌: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ విజృంభించే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్న వేళ ఓ యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. ఏకం గా 25 మంది విద్యార్థులు, ఐదుగురు అధ్యాపకులలో కరోనా లక్షణాలు బయటపడటంతో కళాశాలలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. బహదూర్‌పల్లిలోని టెక్‌ మహీంద్ర ఏకోలా వర్సిటీ ఇటీవల మొదటి సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించింది.

పలు దేశాల విద్యార్థులు వర్సిటీలో చేరగా, కొందరు అస్వస్థతకు గురయ్యారు. వీరికి కరోనా లక్షణాలు వెల్లడయ్యాయి. దీంతో ముందస్తుగా యాజమాన్యం వర్సిటీకి సెలవులు ప్రకటించింది. రెండు వేలకుపైగా విద్యార్థులు ఇందులో విద్యను అభ్యసిస్తున్నారు. గత రెండు రోజులుగా విద్యార్థుల రాకపోకలు లేకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ విషయంపై యూనివర్సిటీ వారిని ‘సాక్షి’ ఫోన్‌లో ఆరా తీయగా అటువంటిదేమీ లేదన్నారు. కాగా, ఈ క్యాంపస్‌లోని 1,700 మంది విద్యార్థులు హోం ఐసోలేషన్‌లో ఆరోగ్యంగానే ఉన్నారని, ఎటువంటి ఆందోళన పడాల్సిన పరిస్థితిలేదని కుత్బుల్లాపూర్‌ మండల వైద్యాధికారి డాక్టర్‌ నిర్మల ‘సాక్షి’కి తెలిపారు.  

మరిన్ని వార్తలు