బుచ్చిబాబు, పిళ్లై ఏం చెప్పారు?.. కవిత విచారణపై టెన్షన్‌!

15 Mar, 2023 20:09 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత గురువారం మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు వెళ్లనున్నారు. లిక్కర్‌ స్కాంలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. దీంతో, రెండోసారి కవిత విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఫిబ్రవరి 11న ఈడీ అధికారులు కవితను 9 గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే.

కాగా.. లిక్కర్‌ స్కాం కేసులో బుచ్చిబాబును బుధవారం ఈడీ ప్రశ్నిస్తోంది. ఈడీ అధికారులు అరుణ్‌ పిళ్లైతో కలిపి బుచ్చిబాబును ప్రశ్నిస్తున్నారు.  లిక్కర్‌ పాలసీ రూపకల్పన, సమావేశాలు, ముడుపులతో ఈడీ ఆరా తీస్తోంది. ఇక, కన్ఫ్రాంటేషన్‌ పద్దతిలో ప్రశ్నించేందుకు పిళ్లై కస్టడీని పొడిగించాలని ఈడీ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. ఇదిలా ఉండగా.. రేపు కవితను ఈడీ విచారించనున్న నేపథ్యంలో మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు, పలువురు మంత్రులు, బీఆర్‌ఎస్‌ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. 

మరోవైపు.. ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన విషయంలో ఈడీ చట్ట విరుద్దంగా వ్యవహరించిందన్నారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదన్నారు. కొంత మంది వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో తనను ఇరికించినట్టు ఆరోపణలు చేశారు. ఈడీ థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తుందన్నారు. చందన్‌ రెడ్డి అనే సాక్షిని కొట్టడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కోరారు. తనపై ఎలాంటి బలవంతపు(అరెస్ట్‌ వంటి) చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై ఈనెల 24న విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు