‘యాప్‌’ సోపాలు.. కార్యదర్శులకు తప్పనిపాట్లు!

8 Oct, 2020 07:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆస్తుల గణనకు సాంకేతిక సమస్యలు

యాప్‌ డౌన్‌.. గంటల కొద్దీ బంద్‌

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతిక సమస్యలు ఆస్తుల నమోదు ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏకకాలంలో లక్షల కొద్దీ ఆస్తుల సమాచారాన్ని యాప్‌లో నమోదు చేస్తుండటంతో సర్వర్‌ మొరాయిస్తోంది. దీంతో పంచాయతీ కార్యదర్శులు ‘యాప్‌’సోపాలు పడుతున్నారు. దసరా రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసిన ప్రభుత్వం.. ఆలోపు ఈ పోర్టల్‌కు వ్యవసాయేతర ఆస్తుల వివరాలను అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇంటింటికీ వెళ్లి సేకరిస్తున్న ఈ డేటాను యాప్‌లో పొందుపర్చడం గగనంగా మారింది. కొన్నిచోట్ల సిగ్నల్‌ అందక.. మరికొన్ని చోట్ల అసలు సిగ్నలే లేక.. ఇంకొన్ని చోట్ల బఫరింగ్‌తో యాప్‌లో వివరాలను నిక్షిప్తం చేయడం తలనొప్పిగా తయారైంది. ఇలాంటి సాంకేతిక సమస్యలతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల యాప్‌ నిలిచిపోయింది. యాప్‌ గాడినపడ్డ తర్వాత.. వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు పంచాయతీరాజ్‌శాఖ ‘న్యాప్‌’ పేరిట కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.(చదవండి: ఆస్తి పన్ను పరిధిలోకి రాని ప్రతి కట్టడం లెక్క తేల్చండి!)

ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రతి కట్టడానికి సంబంధించిన డేటాను ఈ యాప్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. విజయదశమి నుంచి వ్యవసాయేతర ఆస్తులకు కూడా పాస్‌ పుస్తకాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పైకప్పు ఉన్న ప్రతి కట్టడం లెక్కను సేకరించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించింది. అయితే, సాంకేతిక సమస్యలు చుట్టుముడుతుండడంతో నమోదు ప్రక్రియ జాప్యమవుతోంది. దీంతో యాప్‌ను పక్కనపెడుతున్న సిబ్బంది.. సమాచారాన్ని మాన్యువల్‌గా సేకరించి యాప్‌ గాడినపడ్డ తర్వాత దాంట్లో ఎక్కించాలని నిర్ణయించింది. యాప్‌ మొరాయించినందున.. ఆస్తుల నమోదును రాత్రి 9 గంటల వరకు సేకరించాలని ఎంపీవో, ఎంపీడీవోలను ఆదేశిస్తూ కొన్ని జిల్లాల కలెక్టర్లు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. 

‘ప్రైవేటు’గా సమాచార సేకరణ! 
ఆస్తుల నమోదులో ఏ మాత్రం తప్పులు దొర్లినా కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ క్రమంలో వివరాల నమోదులో జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. అయితే, ఆస్తుల నమోదుకు నిర్దేశిత గడువు సమీపిస్తుండటం.. సేకరించాల్సిన ఆస్తుల జాబితా చాంతాడంత ఉండటంతో సమాచార సేకరణకు ఇతరులను స్థానిక యంత్రాంగం రంగంలోకి దించింది. అంగన్‌వాడీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలేగాకుండా.. కాలేజీ విద్యార్థులు, ప్రైవేటు వ్యక్తులను కూడా ఆస్తుల నమోదులో వినియోగించుకుంటోంది. ఇంటింటికీ వెళ్లి నిర్ణీత ఫార్మాట్‌లో వివరాలను సేకరిస్తున్న వీరంతా.. వాటిని కార్యదర్శులకు అందజేస్తున్నారు. కార్యదర్శులు ఆ సమాచారాన్ని యాప్‌లోకి ఎక్కిస్తున్నారు. అయితే, ఆస్తులకు సంబంధించిన వివరాల సేకరణలో పొరపాట్లు జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు