చిన్న నగరాల్లో 2,500 ఐటీ జాబ్స్‌

20 May, 2023 03:55 IST|Sakshi

మరో పది వేల మందికి పరోక్షంగా ఉపాధి 

అమెరికాలో ప్రవాస భారతీయ సీఈఓలతో మంత్రి కేటీఆర్‌ భేటీ 

వివిధ కంపెనీలతో ఒప్పందాలు

గ్రామీణ ఉపాధికి ఊతమివ్వాలని పిలుపు 

త్వరలో సిద్దిపేట ఐటీ టవర్‌లో

కార్యకలాపాలు మొదలవుతాయని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటులో భాగస్వాములు కావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌ డీసీలో 30 ఐటీ కంపెనీల సీఈఓలతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన పలువురు ప్రవాస భారతీయ సీఈఓలతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా సిద్దిపేట, నల్లగొండ, నిజామాబాద్‌ తదితర పట్టణాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవగాహన
ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటివల్ల ద్వితీయ శ్రేణి నగరాల్లో ప్రత్యక్షంగా 2,500 మందికి, పరోక్షంగా పది వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్‌ వెల్లడించారు. 
  
ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటీ వృద్ది 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్లను ప్రారంభించామని, త్వరలో సిద్దిపేట ఐటీ టవర్‌లోనూ కార్యకలాపాలు మొదలవుతాయని కేటీఆర్‌ తెలిపారు. నిజామాబాద్, నల్లగొండలోనూ ఐటీ టవర్ల నిర్మాణం వేర్వేరు దశల్లో ఉందని, ఆదిలాబాద్‌కు కూడా ఐటీ టవర్‌ను మంజూరు చేశామన్నారు. ఐటీ కార్యకలాపాల విస్తరణతో వరంగల్, కరీంనగర్‌ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ వృద్ధి జరుగుతోందన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటు ద్వారా గ్రామీణ ఉపాధికి ఊతమివ్వాలని ప్రవాస భారతీయులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. బెల్లంపల్లి వంటి చిన్న పట్టణాల నుంచి తక్కువ ఖర్చుతో ఐటీ కంపెనీలను నిర్వహించే వీలుందన్నారు. టెక్‌జన్‌ సీఈఓ లాక్స్‌ చేపూరి, బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల ఐటీ కంపెనీల సీఈఓలతో భేటీని సమన్వయం చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లో ఐటీ హబ్‌లు విజయవంతంగా పనిచేయడం వెనుక లాక్స్‌ చేపూరి, వంశీరెడ్డి, కార్తీక్‌ పొలసాని కృషిని కేటీఆర్‌ అభినందించారు. ఈ భేటీలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు. 
 
అంతరిక్ష, వైమానిక, రక్షణ రంగాల్లో ముందంజ 
అంతరిక్ష, వైమానిక, రక్షణ రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోందని, టీఎస్‌ఐపాస్‌ నిబంధనల మేరకు కంపెనీలకు నిర్దేశిత వ్యవధిలో పారదర్శకంగా అనుమతులు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. వాషింగ్టన్‌ డీసీలో కేటీఆర్‌ నేతృత్వంలో శుక్రవారం జరిగిన ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఏరోస్పేస్, అడ్వైజరీ సంస్థలతోపాటు స్టారప్‌లు చర్చల్లో పాల్గొన్నాయి. గత తొమ్మిదేళ్లలో తెలంగాణలో వైమానికి, రక్షణ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెరిగాయని, 2018, 2020, 2022లో ఏరోస్పేస్‌ కేటగిరీలో ఉత్తమ రా్రష్తంగా అవార్డులు వచ్చాయని కేటీఆర్‌ చెప్పారు. ఏరోస్పేస్‌ సిటీ ఆఫ్‌ ఫ్యూచర్‌ కేటగిరీలో హైదరాబాద్‌కు నంబర్‌ వన్‌ ర్యాంకు వచి్చందన్నారు. తమ కార్యాలయంలో డిఫెన్స్, ఏరోస్పేస్‌ సభ్యులతో కేటీఆర్‌ చర్చలు నిర్వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు యూఎస్, ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌íÙప్‌ ఫోరమ్‌ తెలిపింది.    

మరిన్ని వార్తలు