స్వాతంత్య్రం పొందిన తొలినాళ్లలో.. హైదరాబాద్‌ స్టేట్‌ బడ్జెట్‌ ఎంతో తెలుసా?

14 Aug, 2022 02:40 IST|Sakshi
నాటి బడ్జెట్‌ ప్రతులు 

ఇప్పుడు రెండున్నర లక్షల కోట్లు దాటిన తెలంగాణ బడ్జెట్‌  

మేకల కళ్యాణ్‌ చక్రవర్తి 
రాష్ట్ర ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రెండున్నర లక్షల కోట్లపైనే. అంకెల్లో చెప్పాలంటే ఈ ఏడాది మార్చి 7న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. రూ.2,56,858.51 కోట్లు. మరి స్వాతంత్య్రం పొందిన తొలినాళ్లలో, ఉమ్మడి ఏపీగా ఏర్పడకముందు హైదరాబాద్‌ స్టేట్‌ బడ్జెట్‌ ఎంతో తెలుసా? 1955లో ప్రవేశపెట్టిన హైదరాబాద్‌ స్టేట్‌ చివరి బడ్జెట్‌ 1,78,27,464 రూపాయలు మాత్రమే. అంటే కనీసం 2 కోట్లు అయినా దాటలేదు. ఇప్పుడు రెండున్నర లక్షల కోట్లు దాటేసింది. 70 ఏళ్లలో బడ్జెట్‌ పద్దు లక్ష రెట్లకుపైగా పెరిగిందన్న మాట. మరి నాటి బడ్జెట్‌ విశేషాలు, నేటి బడ్జెట్‌తో పోల్చితే ఎలా ఉంటుందో 

చూద్దామా.. 
1955లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రెవెన్యూ ఖర్చు రూ.1,25,63,804గా చూపెట్టా­రు. అదే ఇప్పుడు రెవెన్యూ పద్దు రూ.­1,89,274 కోట్లు. అప్పటి బడ్జెట్‌లో మూల ధన వ్యయం కింద రూ.­52,62,860 చూపెట్టారు. మరి ఇప్పుడు మూలధన వ్యయం రూ. 29,728 కోట్లు 
నాటి బడ్జెట్‌లో కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ పేరుతో రూ.25.87 లక్షలు చూపెట్టా­రు. ఇప్పటి బడ్జెట్‌లో దానికి సరిసమానమైన పంచాయతీరాజ్‌ శాఖకు దాదాపు రూ.30 వేల కోట్లు కేటాయించారు. 
ఇప్పటి బడ్జెట్‌లో అన్నింటికన్నా తక్కువగా శాసనసభా వ్యవహారాలకు రూ.157 కోట్లు కేటాయిస్తే.. నాడు అన్నింటికన్నా తక్కువగా స్టాంపుల శాఖకు రూ. 3,910 మాత్రమే ఇచ్చారు. 
నాడు సివిల్‌ పనులకు రూ.9.51 లక్షలు కేటాయిస్తే.. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, రహదారులు, ఇతర శాఖల్లో సివిల్‌ పనులకు కేటాయింపులన్నీ కలిపితే ఏకంగా రూ. 40 వేల కోట్లు దాటుతాయని అంచనా. 
ఇప్పుడు ఒక్క సాగునీటి శాఖకే రూ.22,691 కోట్లు కేటాయించారు. అప్పటి బడ్జెట్‌లో సివిల్‌ పనుల కింద అన్నీ చూపెట్టారుగానీ ఇరిగేషన్‌ శాఖలో మూలధన వ్యయం కింద ఖర్చును కేవలం రూ.300గానే చూపారు. 
అప్పటి బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి రూ.6 లక్షలు చూపెట్టగా.. ఇప్పుడు ప్రజారోగ్య విభాగమైన వైద్య, ఆరోగ్య శాఖకు రూ.11 వేల కోట్లకుపైగా బడ్జెట్‌ కేటాయించారు. 
అప్పట్లో విద్యకు రూ.5.34 లక్షలు కేటాయించగా.. ప్రస్తుతం విద్యాశాఖ పద్దు రూ.20 వేల కోట్లు దాటింది. 
నాటి బడ్జెట్‌లో ప్రత్యేకంగా రాజకీయ పింఛన్లు, ప్రాదేశిక పింఛన్ల కోసం దాదాపు రూ.5 లక్షలు చూపెట్టారు. ఇప్పుడా తరహా పింఛన్లు లేవు. 
ఇప్పుడు హోంశాఖ (పోలీసింగ్‌)కు రూ.­9,315 కోట్ల మేర నిధులు ప్రతిపాదించగా.. 1955 హైదరాబాద్‌ రాష్ట్ర బడ్జె­ట్‌లో పోలీసింగ్‌కు కేవలం రూ.4.8లక్షలే.. 
అప్పట్లో వ్యవసాయంతోపాటు పశుసంవర్ధక, సహకార శాఖలకు ప్రత్యేక కేటాయింపులు చూపెట్టారు. వ్యవసాయం కంటే అనుబంధ రంగమైన పశుసంవర్థక శాఖకు ఎక్కువ నిధులు కేటాయించారు. వ్యవసాయానికి రూ.1,16,700, పశుసంవర్థకానికి రూ.1,30,274, సహకార శాఖకు రూ.15 వేలు మాత్రమే ఇచ్చారు. ఇప్పటి బడ్జెట్‌లో వ్యవసాయం, సహకార శాఖలకు రూ.25 వేల కోట్ల వరకు కేటాయించగా.. పాడి పరిశ్రమ, మత్స్య శాఖలకు రూ.2,768 కోట్లు చూపారు. 
ఇక నాటి బడ్జెట్‌లో కరువు పద్దు కింద ప్రత్యేకంగా లక్ష రూపాయలు కేటాయించడం గమనార్హం. 
అప్పట్లోనూ అప్పులపై వడ్డీల చెల్లింపులు ఉండేవి. అప్పులకు వడ్డీల కింద 6,600 రూపాయలను చూపారు. ప్రస్తుత బడ్జెట్‌లో వడ్డీల కింద ఏకంగా రూ.18,911 కోట్లను చెల్లించాల్సి ఉన్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు