యాదాద్రీశుడికి పట్టువస్త్రాలు

11 Mar, 2022 01:35 IST|Sakshi
విద్యుత్‌ దీపాల వెలుగుల్లో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం

నేడు స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొననున్న కేసీఆర్‌ దంపతులు

ఉద్ఘాటనపై అధికారులతో సీఎం సమీక్షించే అవకాశం 

28 నుంచి భక్తులకు ప్రధానాలయ దర్శనం

సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణానికి సీఎం కేసీఆర్‌ సతీసమేతంగా శుక్రవారం హాజరుకానున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు బాలాలయంలో నిర్వహించే తిరు కల్యాణోత్సవానికి స్వామివారికి ప్రభుత్వం తరఫున కేసీఆర్‌ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం ఉదయం బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో యాదాద్రికి చేరుకోనున్నారు. 2016లో బాలాలయంలో జరిగిన తిరు కల్యాణోత్సవానికి సీఎం దంపతులు తొలిసారి హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. 

28 నుంచి స్వయంభూల దర్శనం 
ప్రధానాలయం ఉద్ఘాటన ఉత్సవాలు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. 28న ప్రధానాలయం ప్రారంభించి భక్తులకు స్వయంభూల దర్శనం కల్పించనున్నారు. ప్రధానాలయం పనులు దాదాపు పూర్తయ్యాయి. దివ్యవిమానం బంగారు తాపడం పనులు ప్రారంభించాల్సి ఉంది. ఉద్ఘాటన ఉత్సవాలతోపాటు ఇంకా జరగాల్సిన పనులపై సీఎం అధికారులతో సమీక్షించనున్నారు.

21 నుంచి మహాకుంభసంప్రోక్షణ కార్యక్రమ నిర్వహణపై అధికారులతో చర్చించనున్నారు. అలాగే కొండపై ఆర్చీ, బస్‌బే, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్, బాలాలయం చుట్టుపక్కలా చదును చేయడం, సుందరీకరణ పనులు, ఘాట్‌ రోడ్డు వెడల్పు పనులు పర్యవేక్షించనున్నారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కూడా రానున్నారు. కాగా, కొండ కింద భక్తులకు వసతులు కల్పించే పనులను వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే సీఎంవో కార్య దర్శి భూపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  

పంచతల రాజగోపురానికి పసిడి కలశాలు 
యాదాద్రి ప్రధానాలయ రాజగోపురాలు పసిడి కలశాలతో ధగధగలాడనున్నాయి. ప్రధానాలయ ఉద్ఘాటన సమయానికి సప్త, పంచ, త్రితల రాజగోపురాలకు పసిడి కలశాలను బిగించే ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం పంచతల రాజగోపురంపై తొమ్మిది బంగారు కలశాలను ప్రత్యేక శిల్పులు బిగించారు. ఇప్పటికే ఆలయ అష్టభుజి శిఖర మండపాలపై రాగి కలశాలను బిగించారు.  

పంచతల రాజగోపురానికి బిగించిన పసిడి కలశాలు 

సిద్ధమవుతున్న స్వర్ణ రథం 
బాలాలయంలో స్వర్ణ రథం సిద్ధమవుతోంది. దాతల సహకారంతో చెన్నైలోని స్మార్ట్‌ క్రియేషన్‌లో బంగారు తాపడం పూర్తి చేయించి, విడి భాగాలను ఇటీవల క్షేత్రానికి తెచ్చారు. వీటికి అధికారులు, ఆచార్యులు పూజలు నిర్వహించారు. రాత్రి నుంచి రథానికి బంగారు కవచాలు తొడిగే పనులను ప్రారంభించారు.  

మరిన్ని వార్తలు