ఇక క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పోరాటం

31 Mar, 2022 03:43 IST|Sakshi
బీమా ప్రీమియం చెక్కును అందుకుంటున్న న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులు

రాష్ట్రంలో సమస్యలపై ఏప్రిల్‌ 1 తర్వాత ఆందోళనలు 

‘ధాన్యం’పై పోరాటంలో రాహుల్‌ గాంధీ పాల్గొంటానన్నారు 

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వెల్లడి

పార్టీ నేతలతో కలిసి రాహుల్‌తో భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 1వ తేదీ తర్వాత తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు సంబంధించిన సమస్యలపై ప్రజా పోరాటాన్ని ఉధృతం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. గత కొన్ని నెలలుగా పార్టీ సభ్యత్వాలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్‌ నాయకులు ఇకపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయనున్నారని తెలిపారు. ధాన్యం సేకరణకు సంబంధించి చేసే పోరాటంలో పాల్గొంటానని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు బుధవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో పార్టీ సభ్యత్వం తీసుకున్న 40 లక్షల మందికి రూ.2 లక్షల చొప్పున బీమా కోసం ప్రీమియం కింద రూ.6.34 కోట్ల చెక్కును రాహుల్‌ చేతుల మీదుగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులకు అందజేశారు. కాగా 40 లక్షల సభ్యత్వ నమోదు చేసినందుకు రాష్ట్ర నేతలను రాహుల్‌ అభినందించారు. భేటీ అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదులో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని చెప్పారు.

రాష్ట్రంలో నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం 4.5 లక్షల సభ్యత్వాలతో మొదటి స్థానంలో ఉండగా, పెద్దపల్లి నియోజకవర్గం రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు ఏప్రిల్‌ 1 నుంచి రూ.2 లక్షల బీమా వర్తిస్తుందని చెప్పారు. రాహుల్‌తో సుమారు 30 నిమిషాల పాటు జరిగిన భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీనియర్‌ నేతలు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్, అజారుద్దీన్, గీతారెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, మహేశ్వర్‌రెడ్డి, మహేశ్‌గౌడ్, బలరాం నాయక్, హర్కర వేణుగోపాల్, మల్లురవి తదితరులు పాల్గొన్నారు.

రాహుల్‌తో 4న మరోసారి భేటీ 
బుధవారం నాటి భేటీలో రాష్ట్రంలో పార్టీ పటిష్టత, టీఆర్‌ఎస్, బీజేపీలను ఎదుర్కొనే వ్యూహాలపై రాష్ట్ర నేతలతో చర్చించిన రాహుల్‌ గాంధీ.. ఇదే అంశంపై ఏప్రిల్‌ 4న వారితో సమావేశమవ్వాలని నిర్ణయించారు. చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో సుమారు 25 మంది ముఖ్య నేతలు పాల్గొంటారని సమాచారం. కాగా రాష్ట్ర పార్టీలో గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాలు, సీనియర్ల మధ్య విభేదాలతో పాటు రాబోయే ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలనే అంశంపై రాహుల్‌ చర్చిస్తారని తెలిసింది.

మరిన్ని వార్తలు