ఆ ప్లాట్ల వేలం ఆపండి 

22 Sep, 2021 02:32 IST|Sakshi

సర్వే నంబర్ల జిమ్మిక్కులతో పిటిషనర్లను వేధిస్తారా? 

పుప్పాలగూడలో భూముల వేలంపై హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని భూముల వేలంపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పుప్పాలగూడలోని 11.02 ఎకరాల భూమిపై హక్కులు లేకపోయినా.. సంరక్షకుడిగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కాందిశీకుల భూములను వేలం వేయడాన్ని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ఆ భూమిని వేలం వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ భూమిలో ఉన్న ప్లాట్‌ నంబర్లు 25 నుంచి 30 వరకు వేలం వేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

సర్వే నంబర్ల జిమ్మిక్కులతో పిటిషనర్లను వేధింపులకు గురిచేయడం సరికాదని, పిటిషనర్లకు చెందిన భూమిని వేలం వేయరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. పుప్పాలగూడ సర్వే నంబర్‌ 301లోని 11.02 ఎకరాల భూమిని 2006, జూలై 31న తాము కొనుగోలు చేశామని, అయినా హెచ్‌ఎండీఏ ఆ భూముల్ని వేలం వేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసిందంటూ లక్ష్మీ ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ తరఫున సి.నందకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.

కాందిశీకుల చట్టం కింద నవలాల్‌మాల్‌ ప్రజ్వానీ అనే కాందిశీకునికి ప్రభుత్వం కేటాయించిందని, ఈ మేరకు రాష్ట్రపతి 1950లో ఉత్తర్వులు జారీచేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది నివేదించారు. ప్రజ్వానీ వారసుల నుంచి పిటిషనర్లు భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. 42 ఎకరాల వేలానికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అయినా నిబంధనలకు విరుద్ధంగా 99 ఎకరాలకు నోటిఫికేషన్‌ జారీచేశారని మరో న్యాయవాది నివేదించారు.

పిటిషనర్ల భూములు సర్వే నంబర్‌ 302లో ఉన్నాయని, వేలం వేస్తున్న భూములపై పిటిషనర్లకు ఎటువంటి హక్కులు లేవని ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది హరీందర్‌ పరిషద్‌ వాదనలు వినిపించారు. ఒకే ప్లాట్‌ రెండు సర్వే నంబర్లలో ఉన్నట్లుగా పేర్కొన్నారని, ఇదేలా సాధ్యమని ధర్మాసనం హరీందర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ), హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ)ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు