సాహితీ ఇన్‌ఫ్రా పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు..

27 Jan, 2023 15:32 IST|Sakshi

హైదరాబాద్‌: సాహితీ ఇన్‌ఫ్రా పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. బాధితుల ఫిర్యాదులపై విడివిడిగా కేసులు నమోదు చేయాలన్న హైకోర్టు సింగిల్  బెంచ్ తీర్పును సాహితీ ఇన్‌ఫ్రా సవాల్ చేసింది. అన్ని పిటిషన్లు ఓకే కేసుగా పరిగణించాలని కోరింది.

ఇప్పటివరకు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో 42 కేసులు నమోదు కాగా.. సింగిల్ బెంచ్ తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని సాహితీ ఇన్‌ఫ్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.

రియల్ ఎస్టేట్ పేరుతో 1700 మంది బాధితుల నుంచి రూ.530 కోట్లు వసూలు చేసినట్లు సాహితీ ఇన్‌ఫ్రాపై ఆరోపణలున్నాయి. 38 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ నిర్మాణం పేరుతో భారీ మోసానికి తెరతీసినట్లు కేసు ఫైల్‌ అయ్యింది. ప్రాజెక్టు మొదలు పెట్టకముందే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, మరో ప్రాజెక్టులో రూ.900 కోట్లు సాహితీఇన్‌ఫ్రా వసూలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితులు ఈ సంస్థపై కేసులు నమోదుచేశారు.
చదవండి: జయత్రి ఇన్‌ఫ్రా పేరుతో ఘరానా మోసం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు

మరిన్ని వార్తలు