‘డబ్బులు లేక అర్ధాకలి.. ఏ క్షణాన బాంబుల వర్షం కురుస్తుందో అని భయం వేస్తోంది’

25 Feb, 2022 07:42 IST|Sakshi
తల్లిదం‍డ్రులతో విద్యార్థిని వైతరుణి( ఫైల్‌)

సాక్షి,చంపాపేట(హైదరాబాద్‌): ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు స్వదేశానికి రాలేక, అక్కడ ఉండలేక... చేతిలో డబ్బులు లేక అర్ధాకలితో బిక్కుబిక్కుమంటూ  అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది.  యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మిర్యాలగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైతరుణి దీనస్థితి ఇది.  వివరాలు... నల్లగొండ జిల్లా  మిర్యాలగూడకు చెందిన పొట్లపల్లి అశోక్, స్వరూప దంపతులు తమ కుమార్తె వైతరుణితో కలిసి  కర్మన్‌ఘాట్‌లోని పవన్‌పురి కాలనీలో ఉంటున్నారు. (చదవండి: మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌తో మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర చర్చ )

వైతరుణి  2018లో నీట్‌లో క్వాలీఫై అయి ఉక్రెయిన్‌ దేశ రాజధాని కీవ్స్‌ నగరానికి 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న జఫరోజియా పట్టణంలోని ప్రభుత్వ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌లో చేరింది. ప్రస్తుతం ఆమె నాలుగో సంవత్సరం వైద్య విద్య పూర్తి చేసుకుంది.  భారత దేశానికి చెందిన విద్యార్థులంతా తమ దేశానికి వెళ్లిపోవాలని కీవ్స్‌లోని భారత ఎంబసీ అధికారులు 15 రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేశారు. అయితే, యూనివర్సిటీ  నిర్వాహకులు అప్పట్లో  నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రస్తుతం భారత్‌కు వచ్చేందుకు విమాన సౌకర్యం లేక పోవటంతో వైతరుణితో పాటు కొందరు విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. హాస్టల్‌ గదిలోనే బిక్కుబిక్కు మంటూ భారతదేశానికి వచ్చేందుకు ఎదురు చూస్తోంది.

భయంగా ఉంది: వైతరుణి 
జఫరోజియా పట్టణ రహదారులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. షాపింగ్‌ మాల్స్, ఏటీఎంలు మూసేశారు. రెండు రోజులకోసారి రోజుకు ఒక్క గంట మాత్రమే తెరుస్తున్నారు. ఏక్షణాన బాంబుల వర్షం కురుస్తుందో అని భయంగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పదించి మమ్మల్ని సురక్షితంగా భారతదేశానికి చేర్చాలని వైతరుణి ‘సాక్షి’ ప్రతినిధితో ఫోన్‌లో వేడుకుంది. వండుకునేందుకు నిత్యావసర వస్తువులన్నీ అయిపోయాయి. ఏటీఎంలు మూసివేయటంతో చేతిలో డబ్బులు లేవు.. అని ఆవేదన వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు