Russia Ukraine War Affect: World divided into Two Parts Details Inside - Sakshi
Sakshi News home page

Russia Ukraine War Affect: ప్రపంచం చెరి సగం.. భారత్‌ ఎందుకు తటస్థం?

Published Fri, Feb 25 2022 7:30 AM

Russia Ukraine War Affect: World divided into Two Parts  - Sakshi

ప్రపంచం చెరి సగమై పోయింది
రష్యా దండయాత్రకి ఎంతమంది 
సై అంటున్నారో..
ఉక్రెయిన్‌పై ఉరమడాన్ని 
అంతే మంది ససేమిరా అంటున్నారు. 
ఒక సంక్షోభంపై ప్రపంచం 
నిట్టనిలువునా రెండుగా చీలిపోవడం 
గత 40 ఏళ్ల కాలంలో ఎప్పుడూ కనిపించలేదు. 
భారత్‌ మాత్రం ఎటూ మొగ్గు చూపించలేక తటస్థ వైఖరినే ఎంచుకుంది. 

Russia-Ukraine crisis: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయాయి. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత, అంటే  దాదాపుగా 40 ఏళ్ల తర్వాత ప్రపంచ దేశాలు చెరి సగంగా విడిపోవడం ఇదే తొలిసారి. కోవిడ్‌–19 వల్ల కలిగిన ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు రష్యా యుద్ధం మొదలు పెట్టడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డాయి. మళ్లీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం దిశగా వెళ్లే ప్రమాద ఘంటికలు మోగడంతో పశ్చిమాది దేశాలు రష్యాకి గట్టి హెచ్చరికలే పంపాయి. అయినప్పటికీ రష్యా తగ్గేదేలే అంటూ సమరానికే సిద్ధం కావడంతో దాని మిత్రదేశాలు తమ అస్త్రశస్త్రాలకి పదును పెడుతున్నాయి.

ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత పశ్చిమ దేశాల కంపెనీలు రష్యాలో ఎన్నో పెట్టుబడులు పెట్టాయి. అంతేకాకుండా ముడిచమురు, సహజవాయువు సరఫరాలో రష్యా అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇక ఆహార రంగం, లోహాలు వంటి విషయాల్లో కూడా రష్యా ఆధిపత్యం ఎక్కువగానే ఉంది. దీంతో ఆ దేశంపై పూర్తి స్థాయిలో ఆంక్షల్ని విధించడం అంత సులభం కాదు. ఈ పరిస్థితుల్లో రష్యాని కట్టడి చేయడం పశ్చిమ దేశాల ముందున్న అతి పెద్ద సవాల్‌గానే చెప్పాలి. ఈ సంక్షోభంలో ఎటువైపు ఉండడానికి ఎవరి కారణాలు వారికున్నాయి. 

రష్యా 
చైనా నుంచి రష్యాకి గట్టి మద్దతు ఉంది. ఉక్రెయిన్‌లో నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ ( నాటో) ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఇప్పటికే చైనా దుమ్మెత్తి పోస్తోంది. చైనాతో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఎప్పుడు విభేదించినా రష్యా ఆ దేశానికి అండగా ఉంటూ వస్తోంది. వాణిజ్యం, మిలటరీ, అంతరిక్షం వంటి రంగాల్లో ఇరు దేశాలు ఎప్పుడూ పరస్పరం సహకరించుకుంటూ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా చైనా రష్యాకే అండగా ఉంది.
రష్యాకి మరో మిత్రదేశమైన క్యూబా కూడా ఆ దేశానికి అండగా ఉంది. నాటో బలగాల్ని అమెరికా రష్యా సరిహద్దులకి విస్తరించినప్పుడు ఆ దేశం అగ్రరాజ్యాన్ని గట్టిగా నిలదీసింది. 
ఒకప్పుడు సోవియెట్‌ యూనియన్‌లో భాగంగా ఉన్న అర్మేనియా, కజకస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, బెలారస్‌లు రష్యాకే మద్దతుగా నిలిచాయి. దీనికీ ఒక కారణం ఉంది. ఈ ఆరు దేశాల మధ్య కలెక్టివ్‌ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌టీవో) ఒప్పందం అమల్లో ఉంది. ఈ ఒప్పందం ప్రకారం ఏ దేశం మీద ఎవరు దాడి చేసినా, అది తమ మీద దాడిగానే భావించి ఒకరికొకరు సహకారం అందించుకోవాలి. 
మధ్య ప్రాచ్య దేశాల్లో ఇరాన్‌ ఒక్కటే రష్యా వైపు ఉంది. ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న దగ్గర్నుంచి రష్యా ఇరాన్‌ని తనవైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అమెరికా దాని మిత్రపక్షాలు, ఇరాన్‌కి మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు, రష్యా ఇరాన్‌కి ఆయుధాలు సరఫరా చేసింది. దీంతో ఇరాన్‌ ఇప్పుడు రష్యాకి అనుకూలంగా గళం పెంచుతోంది. 
అణు పరీక్షల ద్వారా అగ్రరాజ్యం అమెరికాకు చుక్కలు చూపిస్తున్న ఉత్తర కొరియా రష్యాకి మద్దతునిస్తోంది. ఇటీవల కాలంలో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల సమయంలో ఆ దేశంపై అమెరికా ఆంక్షలు విధించడానికి ప్రయత్నిస్తే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో  చైనా, రష్యా అడ్డుపడ్డాయి. దీంతో పూర్తి స్థాయి యుద్ధం అంటూ జరిగితే ఉత్తర కొరియా రష్యా వైపే ఉంటుంది. 
సిరియా, వెనెజులా రష్యాకి మొదట్నుంచి మిత్రదేశాలుగా ఉన్నాయి. 2011లో సిరియాలో అంతర్యుద్ధం తలెత్తినప్పుడు రష్యా ఆ దేశానికి పూర్తి సహకారం అందించింది. 

చదవండి: (సరికొత్త విషమ సమస్యలో భారత్‌) 

ఉక్రెయిన్‌ 
అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్‌ వంటి శక్తిమంతమైన దేశాలు ఉక్రెయిన్‌కి అండగా ఉన్నాయి. రష్యా దురాక్రమణకి సిద్ధమవుతున్న దగ్గర్నుంచి ఉక్రెయిన్‌కి ఆయుధాలు సరఫరా చేస్తూ మద్దతునిస్తున్నాయి. రష్యాకి గట్టి హెచ్చరికలు చేస్తూ వస్తున్నాయి
అమెరికా, బ్రిటన్‌తో పాటు నాటోలో భాగస్వాములైన 30 యూరప్‌ దేశాలన్నీ ఉక్రెయిన్‌కే మద్దతుగా ఉన్నాయి. బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్‌ల్యాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్‌ దేశాలు ఉక్రెయిన్‌కి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాయి
జర్మనీ, ఫ్రాన్స్‌లు ఉద్రిక్తతల నివారణకి మొదట్నుంచి ప్రయత్నిస్తూ వచ్చాయి. రష్యాకి నచ్చజెప్పడానికి ప్రయత్నాలు చేశాయి. ఎప్పుడైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌లో రెండు ప్రావిన్స్‌లు లుహాన్సŠక్, డాంటెస్క్‌లకు స్వతంత్ర హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారో అప్పట్నుంచి ఆ దేశాలు ఉక్రెయిన్‌కే మద్దతుగా ఉంటామని ప్రకటించాయి. రష్యానుంచి  పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా ఒప్పందాన్ని కూడా జర్మనీ నిలిపివేసింది.
జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచి ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించాయి. 
రష్యా దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించిన చెక్‌ రిపబ్లిక్‌ తన మద్దతుదారులతో కలిసి ఉక్రెయిన్‌కి అండగా ఉంటామని ప్రకటించింది.
రష్యా సరికొత్త సామ్రాజ్యవాదాన్ని పోలాండ్‌ మొదట్నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉక్రెయిన్‌కి చమురు, ఆయుధాలు, ఇతర మానవతా సాయం అందిస్తామని ప్రకటించింది. 
యూరోపియన్‌ యూనియన్‌ చీఫ్‌ ఉర్సులా లెయెన్‌ రష్యా దాడిని ఖండించారు. ఈ చీకటి రోజుల్లో  తాము ఉక్రెయిన్‌లో అమాయకులైన పౌరుల గురించి ఆలోచిస్తున్నామని, ఈ రక్తపాతానికి రష్యా సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు. 

చదవండి: (Russia vs Ukraine: బాహుబలితో తలపడగలదా?)

భారత్‌ ఎందుకు తటస్థం
ఈ సంక్షోభంలో భారత్‌ ఎటు వైపు నిలవలేక తటస్థ వైఖరి అవలింబిస్తోంది. అటు రష్యాతోనూ, ఇటు అమెరికాతోనూ బలమైన సంబంధాలున్న భారత్‌ ఎటు వైపు మొగ్గు చూపించకుండా శాంతిమంత్రమే శరణ్యమని భావించింది. చైనాతో సరిహద్దుల్లో సంక్షోభం ఎదుర్కొన్నప్పట్నుంచి రష్యా తమ దేశానికి అండగా ఉండాలని భారత్‌ కోరుకుంటోంది. చైనా ప్రభుత్వంలో వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఉన్న పరపతి కారణంగా సరిహద్దుల్లో చైనా దూకుడుకు రష్యా కళ్లెం వేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అంతే కాకుండా రష్యా నుంచి క్షిపణి కొనుగోలు ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో అటు ఆసియా, ఇటు యూరప్, పశ్చిమాది దేశాలతో భారత్‌ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసింది.

విదేశీ వాణిజ్యం నుంచే భారత్‌ జీడీపీలో 40% వస్తోంది. . 1990 దశకంలో 15% మాత్రమే ఉన్న విదేశీ వాణిజ్యం ఇప్పుడు 40శాతానికి పెరగడానికి  భారత్‌ అనుసరిస్తున్న విదేశాంగ విధానమే కారణం. అమెరికా, పశ్చిమ యూరప్‌లో ఉన్న దాని మిత్రదేశాలతో భారత్‌ 35 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల డాలర్ల వ్యాపారం చేస్తోంది. ఇక రష్యాతో వెయ్యి నుంచి 1200 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోంది. రక్షణ రంగంలో కూడా రష్యా, అమెరికాలతో సంబంధాలు ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయి. అయితే ఆయుధాలకు సంబంధించిన స్పేర్‌ పార్ట్‌లు, ఇతర పరికరాల కోసం రష్యాపైనే మనం ఎక్కువగా ఆధారపడ్డాం. ఈ కారణాలతో భారత్‌ ఎటూ నిలబడలేకపోయింది. భారత్‌ తీసుకున్న వైఖరిపై రష్యా హర్షం వ్యక్తం చేస్తే, ఉక్రెయిన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.  
– నేషనల్‌ డెస్క్, సాక్షి  

Advertisement
Advertisement