ఆర్టీసీ కార్మిక నేతలతో మంత్రుల చర్చలు

10 Oct, 2022 02:04 IST|Sakshi
కేటీఆర్, హరీశ్‌లతో ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య నేతలు 

డిమాండ్లపై చర్చించిన మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీశ్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రెండున్నరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఆదివారం మంత్రులు చర్చలకు శ్రీకారం చుట్టారు. తొలుత ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆ తర్వాత మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ సమక్షంలో చర్చించారు. 2019లో ఆర్టీసీ సమ్మె సమయంలో ఆర్టీసీ యూనియన్ల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేయడం తెలిసిందే.

అప్పటి నుంచి యూనియన్ల మనుగడను పునరుద్ధరించాలని, గుర్తింపు యూనియన్‌ ఎన్నికలు నిర్వహించాలని కార్మిక నేతలు ఎంతగా డిమాండ్‌ చేసినా ప్రభుత్వం పరిశీలనకు కూడా సిద్ధం కాలేదు. చివరకు మంత్రులను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్‌ దక్కలేదు. పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ, డీఏ బకాయిలు, గత వేతన సవరణ బాండ్ల బకాయిలు, సకలజనుల సమ్మె కాలం బకాయిలు, ఇతర దీర్ఘకాలిక డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలన్న విషయంలోనూ నేరుగా మంత్రులు వారితో చర్చించలేదు. ఇంతకాలం తర్వాత ‘మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య’ పేరుతో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమిస్తున్న సమయంలో నేతలతో మంత్రుల చర్చించడం విశేషం.

ముగ్గురు మంత్రులతో చర్చల్లో భాగంగా, కార్మిక నేతలు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను వారికి సమర్పించారు. అధికారులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చాక మూడు నాలుగు రోజుల్లో మరోసారి భేటీ అవుతామని కూడా వారు పేర్కొన్నట్టు చెబుతున్నారు. భేటీలో సమాఖ్య నేతలు రాజిరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, కత్తులయాదయ్య, మోహన్‌రెడ్డి, కొవ్వూరు యాదయ్య, రామదాసు, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న కొన్ని అంశాలకైనా పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ఉన్నట్టు సమాఖ్య చైర్మన్‌ రాజిరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. మంత్రులతో జరిగిన భేటీల్లో చర్చించిన విషయాలను నేతలు, ఆదివారం సాయంత్రం మునుగోడులో సమాఖ్య సభ్యులకు వివరించారు. డిమాండ్లు పరిష్కారం కాని పక్షంలో, ముందుగా ప్రకటించినట్టు సమాఖ్య పక్షాన ఉప ఎన్నికల బరిలో నిలవాల్సిందేనని సభ్యులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు