వివాదం ఉందంటే అక్కడ వీరి కన్ను పడుద్ది!

18 Aug, 2020 12:07 IST|Sakshi
లంచంలో కేసులో పట్టుబడ్డ రాంపల్లి వీఆర్‌ఏ సాయిరాజ్‌, కందాడి అంజిరెడ్డి, శ్రీనాథ్‌ యాదవ్, తహసీల్దార్‌ నాగరాజు

పదుల సంఖ్యలో గ్రేటర్‌ ఎంపీ ఆర్టీఐ దరఖాస్తులు

అన్నీ వివాదాస్పద భూములవే? 

నిందితుల వద్ద ఆర్టీఐ దరఖాస్తులు లభ్యం 

తహసీల్దార్లతో దోస్తీ చేసి, భూముల అన్యాక్రాంతానికి స్కెచ్‌ 

సమాచార హక్కును స్వప్రయోజనాలకు వాడుకుంటున్న వైనం 

సాక్షి, హైదరాబాద్‌: ముందు ఆర్టీఐకి దరఖాస్తు చేస్తారు.. తర్వాత వివాదాస్పద భూములపై కన్నేస్తారు.. ఆ తర్వాత వెంచర్‌ వేస్తారు.. ఇదీ భూబకాసురుల భూమంతర్‌.. అయితే, దీని వెనుక ఓ గ్రేటర్‌ ఎంపీ ఉన్నాడా? అంటే.. ఉన్నాడనే అనుమానాలకు కొన్ని ఆధారాలు ఏసీబీ అధికారులకు చిక్కాయి. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.. ఆయన గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎంపీ.. గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సమాచార హక్కు కింద దరఖాస్తు చేయడంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల్లోనే అత్యంత చురుకైన నేతగా ఆయనకు పేరుంది.

ఆయన సమాచార హక్కు చట్టం కింద వివాదాస్పద భూముల వివరాలు అడగడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కీసర తహసీల్దార్‌ నాగరాజు వ్యవహారంలో సహనిందితుడు రియల్టర్‌ అంజిరెడ్డి వద్ద నుంచి అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో గ్రేటర్‌కు చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన పత్రాలు లభ్యమవడం, అవి కూడా ఆయన లెటర్‌ హెడ్‌తో ఉండటం ఏసీబీ అధికారులను ఆశ్చర్యపోయేలా చేసింది.  
(చదవండి: 1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్‌)

అధికారుల మచ్చిక.. భూముల స్వాధీనం 
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రియల్టర్‌ అంజిరెడ్డి సదరు ఎంపీకి అనుచరుడు. వివాదాస్పద భూముల విషయంలో వీరు పథకం ప్రకారం వెళతారు. ముందు వీరందరు కలిసి నగర శివారులోని వివాదాస్పద భూముల వివరాలు తెలపాలంటూ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేస్తారు. అదే తహసీల్దార్‌ ఆఫీసులో ఉన్న తహసీల్దార్‌ నుంచి కిందిస్థాయి అధికారులకు లక్షల రూపాయలు లంచాలిచ్చి తమవైపునకు తిప్పుకుంటారు. తరువాత ఆ భూములను తమ పేరుపై బదలాయించుకుని, అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేస్తారు. ఒక్కో దరఖాస్తులో పదుల సంఖ్యలో సర్వే నంబర్లు వేసి ఉండటంతో కొన్నేళ్లుగా నగరం చుట్టూ ఉన్న వందల ఎకరాలపై వీరు కన్నేసినట్లు స్పష్టమవుతోంది. 

వివరాలు కోరిన భూములు ఉన్నాయా? 
గతేడాది నుంచి గ్రేటర్‌ పరిధిలోని దుండిగల్, కండ్లకోయ, గుండ్లపోచంపల్లి, శామీర్‌పేట, కీసర, మేడ్చల్‌ తదితర ప్రాంతాల్లో వీరు వివాదాస్పద, లిటిగేషన్‌ భూములకు సంబంధించి ఆర్టీఐకి అనేక దరఖాస్తులు చేసినట్లు సమాచారం. ఇవన్నీ వందల ఎకరాల్లో ఉంటాయని తెలిసింది. వీటి విలువ రూ.వందల కోట్లపైమాటే. వీరు దరఖాస్తు చేసిన భూములు ఇప్పుడు అలాగే ఉన్నాయా? లేక, అవి కూడా అన్యాక్రాంతమయ్యాయా? ఎవరి పేరు మీదనైనా రిజిస్ట్రేషన్‌ అయ్యాయా? ఇందుకు ఏయే మండలాల రెవెన్యూ అధికారులు సహకరించారు? తదితర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయాలపై త్వరలోనే ఏసీబీ అధికారులు ఆరా తీయనున్నారు. ఒకవేళ అందులో అక్రమాలున్నట్లు తేలితే.. ఈ వ్యవహారం ఆ ఎంపీ మెడకు చుట్టుకోనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 
(కీసర ఇంచార్జ్‌ తహశీల్దార్‌గా గౌతమ్‌ కుమార్‌)

మరిన్ని వార్తలు