ఈ ప్రశ్నలకు బదులివ్వండి.. 

27 May, 2022 02:33 IST|Sakshi

ప్రధాన మంత్రికి 17 ప్రశ్నలు సంధించిన టీఆర్‌ఎస్‌ 

మోదీ ప్రయాణించిన పలు కూడళ్లు, మార్గాల్లో ఫ్లెక్సీల ఏర్పాటు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీఆర్‌ఎస్‌ పార్టీ వినూత్నంగా ప్రశ్నలతో స్వాగతం పలికింది. గురువారం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ప్రధానికి 17 ప్రశ్నలు సంధించింది. ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లను గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ పరిసరాలతోపాటు ప్రధాని ప్రయాణించిన వివిధ మార్గాల్లో ఏర్పాటు చేశారు.

తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా మోదీని ప్రశ్నిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ క్యాడర్‌ ఈ బ్యానర్లు ఏర్పాటు చేసింది. ఈ ప్రశ్నలు ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే ఈ ప్రశ్నలను హైదరాబాద్‌ యువత స్వచ్ఛందంగా సంధించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

ఆ ప్రశ్నలివే.. : 1. మోదీజీ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీని కూడా ఎందుకు మంజూరు చేయలేదు? 2. తెలంగాణలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఎక్కడ ఉంది? 3. తెలంగాణకు డిఫెన్స్‌ కారిడార్‌ ఎందుకు మంజూరు చేయలేదు? 4. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? 5. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎక్కడ?

6. కాజీపేట రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఏది?  7. గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌ను హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌కు ఎందుకు తరలించారు? 8. తెలంగాణకు కొత్తగా నవోదయ విద్యాలయాలను ఎందుకు మంజూరు చేయడంలేదు? 9. నిజామా బాద్‌లో పసుపు బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదు? 10. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ ఎక్కడ? 11. తెలంగాణకు ఐటీఐఆర్‌ ఎక్కడ?

12. తెలంగాణకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ ఏది? 13. నీతి ఆయోగ్‌ చెప్పినప్పటికీ మిషన్‌ భగీరథకు నిధులు ఎందుకు ఇవ్వలేదు? 14. హైదరాబాద్‌కు వరద సాయం ఎందుకు చేయలేదు? 15. తెలంగాణకు మెగా పవర్‌లూమ్‌ టెక్స్‌టైల్‌ క్లస్టర్‌ ఒక్కటికూడా ఎందుకు మంజూరు చేయలేదు? 16. ఫార్మాసిటీకి ఆర్థిక సాయం ఏమైనా చేశారా? 17. తెలంగాణకు ఐఐఎం ఎక్కడ?  

మరిన్ని వార్తలు