బియ్యం ఎగుమతులపై..  తప్పుదోవ పట్టించారు

5 Apr, 2022 02:27 IST|Sakshi
ఢిల్లీలోని టీఎస్‌ భవన్‌లో విలేకర్లతో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ ఎంపీ కె. కేశవరావు. చిత్రంలో ఎంపీలు రాములు, సురేష్‌ రెడ్డి, నామా నాగేశ్వర్‌ రావు, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, బడుగు లింగయ్య, పసునూరి రవీందర్, బీబీ పాటిల్, మాలోత్‌ కవిత, రంజిత్‌ రెడ్డి తదితరులు

పీయూష్‌ గోయల్‌పై టీఆర్‌ఎస్‌ ప్రివిలేజ్‌ మోషన్‌ 

బియ్యం ఎగుమతి చేసినట్లు వెబ్‌సైట్‌లో ఉంటే చేయలేదని కేంద్రమంత్రి చెప్పారని వెల్లడి 

నోటీసులపై చర్చించాలని ఉభయ సభల్లో ఆందోళన 

సాక్షి, న్యూఢిల్లీ: విదేశాలకు ఉప్పుడు బియ్యం (బాయిల్డ్‌ రైస్‌) ఎగుమతులకు సంబంధించి ఈ నెల 1న రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఇచ్చిన సమాధానం దేశ ప్రజలను తప్పు దోవ పట్టించేలా ఉందని టీఆర్‌ఎస్‌ ఎంపీలు పేర్కొన్నారు. ఈ మేరకు ఉభయ సభల్లో ప్రివిలేజ్‌ నోటీసులు ఇచ్చా రు. నామా నాగేశ్వర్‌రావు, రంజిత్‌రెడ్డి, బీబీ పాటి ల్, ఎంఎస్‌ఎన్‌ రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కవిత, రాములు, నేతకాని వెంకటేశ్, పసునూరి దయాకర్‌ లు సోమవారం లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లాకు నోటీసులు అందజేశారు.

రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్‌లు నోటీసులిచ్చారు. రాష్ట్రాల్లో అధికంగా ఉన్న బాయిల్డ్‌ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులను ఆదుకోవాలని పార్లమెంటు సభ్యుడొకరు కోరగా.. కేంద్రమంత్రి స్పందిస్తూ డబ్ల్యూటీఓ నిబంధనల కారణం గా కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగమతులు చేయలేదని వివరణ ఇచ్చారని నోటీసుల్లో ఎంపీలు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని గణాం కాలను పరిశీలిస్తే మిలియన్ల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లుగా ఉందని తెలి పారు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేంద్రమంత్రి జవాబివ్వడం సభా హక్కులను ఉల్లంఘించడమేనన్నారు.  

ఉభయ సభల నుంచి వాకౌట్‌ 
ప్రివిలేజ్‌ నోటీసులపై చర్చించాలని పట్టుబడుతూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు లోక్‌సభలో నిరసనకు దిగారు. ‘రైతులను కాపాడండి, రాష్ట్రానికి న్యాయం చేయండి’అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేశారు. అయినా స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు కొనసాగించడంతో నిరసన వ్యక్తం చేస్తూ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఇదే అంశమై రాజ్యసభ నుంచి కూడా ఎంపీలు వాకౌట్‌ చేశారు.  

110 దేశాలకు ఎగుమతులు: ఎంపీలు కేకే, నామా 
వాణిజ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారమే కేంద్రం 110 దేశాలకు బాయిల్డ్‌ బియ్యాన్ని ఎగుమ తి చేస్తోందని ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు తెలిపారు. ప్రపంచంలోని పలు దేశాలు బియ్యం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా, తెలంగా ణ బాయిల్డ్‌ రైస్‌ ఎందుకు పంపడం లేదని ప్రశ్నిం చారు.  బియ్యం సేకరించలేమని కేంద్రం పార్లమెంట్‌లో చెబితే రాష్ట్ర ప్రభుత్వమే రైతులను కాపాడు కుంటుందని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.    

మరిన్ని వార్తలు