ఏపీకి 3,300 ‘సంక్రాంతి’ బస్సులు

25 Dec, 2022 02:43 IST|Sakshi

ఇరు రాష్ట్రాల ఆర్టీసీల ఏర్పాట్లు.. 

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతికి హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లే ఏపీవాసుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడపనున్నాయి. ఇప్పటికే ఏపీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి ఆంధ్రాలోని వివిధ ప్రాంతాలకు 1,800 బస్సులు నడపాలని నిర్ణయించగా తాజాగా టీఎస్‌ఆర్టీసీ దాదాపు 1,500 బస్సులు నడిపేందుకు కసరత్తు చేస్తోంది.

గత రెండేళ్లలో కోవిడ్‌ తీవ్రత వల్ల సిటీ నుంచి వెళ్లే ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఆ మేరకు బస్సు­లు తగ్గించిన ఇరు ఆర్టీసీలు.. ప్రస్తుతం భారీగా బస్సు సర్వీసులు పెంచాయి. ఈసారి నగరం నుంచి ఏపీకి దాదాపు 15లక్షల మంది వెళ్లే అవకా­శం ఉందని అంచనా వేస్తున్నారు. జనవరి 6 నుంచి 14 వరకు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు వైపు వెళ్లే బస్సులను సీబీఎస్‌ (ఓల్డ్‌ హాంగర్‌) నుంచి నడపనున్న­ట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ కృష్ణకిషోర్‌ నాథ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ ఆంధ్రావైపు వెళ్లే బస్సులను దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్లే బస్సులను ఉప్పల్‌ నుంచి, కరీంనగర్‌వైపు వెళ్లే బస్సులను జేబీఎస్‌ నుంచి నడిపేందుకు సన్నాహాలు చేస్తోందని అధికారులు తెలిపారు.  

ప్రత్యేక చార్జీలు లేకుండానే.. 
నిజానికి రెండు ఆర్టీసీలు నడిపే ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు సరిపోవు. ఎక్కువ మంది రైళ్లలో వెళ్లనుండగా అంతకంటే ఎక్కువ మంది సొంత, ప్రైవేటు వాహనాల్లో వెళ్తుంటారు. కొంతకాలంగా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులతోపాటు కార్లు, మినీ బస్సుల వల్ల ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లుతోంది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకొనే క్రమంలో ఇరు ఆర్టీసీలు పండుగ స్పెషల్‌ బస్సుల్లో విధించే 50 శాతం అదనపు చార్జీని రద్దు చేశాయి.

తెలంగాణ ఆర్టీసీ ఏపీ, కర్ణాటకతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు రెగ్యులర్‌ సర్వీసులు కాకుండా 4,233 అదనపు బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. ఏపీఎస్‌ ఆర్టీసీ నిత్యం హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 352 బస్సులను నడుపుతోంది. పండుగ నేపథ్యంలో ఆ బస్సులకు అదనంగా 1,800 స్పెషల్‌ బస్సులు తిప్పనున్నట్లు ప్రకటించింది.   

మరిన్ని వార్తలు