అక్కడికెళ్లి ఏం చూస్తారు?

8 Aug, 2020 05:12 IST|Sakshi

గుడి, మసీదు కూల్చామని ప్రభుత్వమే చెప్పింది 

జీ బ్లాక్‌ కింద నిధి ఉందని ఎవరు ధ్రువీకరించారు? 

సచివాలయ శిథిలాల సందర్శనకు అనుమతించాలన్న పిటిషన్‌పై హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయ భవనాల కూల్చివేత ప్రదేశానికి ప్రజాప్రతినిధులు వెళ్లి ఏం చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. గుడి, మసీదు కూల్చామని ప్రభుత్వమే ప్రకటించిందని, ఈ విషయం ప్రసార మాధ్యమాల్లోనూ వచ్చిందని, అలాంటప్పుడు అక్కడ కొత్తగా చూసి శోధించాల్సింది ఏముందని ప్రశ్నించింది. సచివాలయ భవనాల కూల్చివేత ప్రదేశానికి అనుమతివ్వాలని కోరినా ప్రభుత్వం అనుమతించట్లేదని, ఈ నేపథ్యంలో తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలం టూ కాంగ్రెస్‌ నేతల తరఫు న్యాయవాది అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఇందులో అత్యవసరంగా విచారించాల్సిన అంశాలేవీ లేవం టూ అభ్యర్థనను తిరస్కరించింది.

138 ఏళ్ల పురాతనమైన గుడిని కూల్చారని, అప్రకటిత నిషేధం విధించి ఎవరినీ కూల్చివేత ప్రదేశాలకు అనుమతివ్వడం లేదని వారి తరఫు న్యాయవాది రజినీకాంత్‌రెడ్డి నివేదించారు. జీ బ్లాక్‌ కింద నిజాం నిధి ఉంది కాబట్టే ఎవరినీ అనుమతించట్లేదన్న అనుమానాలున్నాయని, ప్రజాప్రతినిధులు అక్కడికెళ్లి వాస్తవాలను ప్రజలకు తెలపాలనుకుంటున్నారని వివరించారు. ‘నిధులు వెలికితీస్తానంటూ ఉత్తరప్రదేశ్‌లో ఒక బాబా సమాధిలోకి వెళ్లాడు. నిధి వెలికి తీయడమేమోగానీ సమాధి నుంచి మళ్లీ ఆయన బయటకు తిరిగి రాలేదు. అలాగే సచివాలయంలోని జీ బ్లాక్‌ కింద నిజాం నిధి ఉందనే సమాచారంతో అక్కడికి వెళ్తామనడం సరికాదు. అక్కడ నిధి ఉందని ఏ విభాగం ధ్రువీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా వాదనలు వినిపించడం సరికాదు’ అని ధర్మాసనం సూచించింది.

సందర్శనకు అనుమతించండి 
సచివాలయ భవనాల కూల్చివేత ప్రదేశానికి అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, మాజీమంత్రి మహ్మద్‌ అలీ షబ్బీర్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్‌యాదవ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయిం చారు. ఈ మేరకు శుక్రవారం పిటిషన్‌ దాఖ లు చేశారు. సచివాలయం భవనాల కూల్చి వేత ప్రదేశానికి అనుమతించాలంటూ గత నెల 27న, 30న డీజీపీకి వినతిపత్రం సమర్పించినా స్పందన లేదన్నారు. 25.5 ఎకరాల్లో విస్తరించి ఉన్న సచివాలయం 10 బ్లాకులుగా ఉందని, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేత పనులను రహస్యంగా చేపడుతున్నారని తెలిపారు.

నల్లపోచమ్మ దేవాలయం, మసీదు కావాలని కూల్చలేదని, తిరిగి వాటిని నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించడం అనేక అనుమానాలకు ఆస్కారమిస్తోందన్నారు. నిజాం 132 ఏళ్ల క్రితం నిర్మించిన జీ బ్లాక్‌ కింద నిధి ఉందనే వార్తలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉండి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలన్నారు.  ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే సచివాలయం చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలోకి ప్రజలనెవరినీ అనుమతించలేదని తెలిపారు. సచివాలయం సందర్శనకు అనుమతించేలా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌ విచారణకు రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు