వరద నష్టం 10,000 కోట్లు

23 Oct, 2020 01:39 IST|Sakshi
గురువారం హైదరాబాద్‌లో కేంద్ర బృందం సభ్యులకు వరద నష్టం గురించి ఫొటో ప్రదర్శన ద్వారా వివరిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌  

దెబ్బతిన్న పంటలు రూ.8,633 కోట్లు

రోడ్లకు రూ.222 కోట్లు.. జీహెచ్‌ఎంసీకి రూ.567 కోట్ల నష్టం

కేంద్ర బృందానికి రాష్ట్రం నివేదన

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రానికి అపార నష్టం జరిగిందని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. దాదాపు రూ.10 వేల కోట్ల వరకు నష్టం జరిగిందని శాఖల వారీగా గణాం కాలను వివరించింది. పంట నష్టం రూ.8,633 కోట్లు, రహదారులకు రూ. 222 కోట్లు, జీహెచ్‌ఎంసీకి రూ.567 కోట్లు నష్టం వాటిల్లిం దని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం వరద సహా యక చర్యలకు తక్షణంగా రూ.550 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. వరదల సమ యంలో ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర హోంశాఖ సం యుక్త కార్యదర్శి ప్రవీణ్‌ వశిష్ట నేతృత్వంలో రాష్ట్రానికి వచ్చిన ఐదుగురు సభ్యుల కేంద్ర బృందంతో గురువారం సోమేశ్‌కుమార్‌ బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సమావేశమయ్యారు. ఇరిగే షన్, మున్సిపల్‌ శాఖ, ఆర్‌అండ్‌బీ, జీహెచ్‌ ఎంసీ, వాటర్‌ బోర్డ్, వ్యవసాయం, ఇంధన, పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధి కారులు ఈ భేటీలో వరద నష్టం, సహాయక చర్యల తీరును పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

గత 10 రోజులుగా రాష్ట్రంలో అత్యధిక వర్షాల వల్ల హైదరాబాద్, పరిసర జిల్లాలో భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని తెలిపారు. మూసీ నదికి వరద ముంపు ఏర్పడటంతో పాటు నగరంలో మూడు చెరువులకు గండిపడటం వలన నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని వివరించారు. రాష్ట్రంలో మౌలిక వసతులకు భారీగా నష్టం జరిగిందని, ఆ మేరకు ప్రాథమిక అంచనాను రూపొందించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వరదలు, వర్షాలతో జరిగిన నష్టంపై ఎగ్జిబిషన్‌ ప్రదర్శన ఏర్పాటు చేశారు. 2 లక్షల మందికి ఆహార పొట్లాలను అందజే శామన్నారు. వరద ముంపునకు గురైన 15 సబ్‌స్టేషన్‌లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించినట్టు చెప్పారు. 

నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
సమావేశం అనంతరం కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించేందుకు రెండు బృందాలుగా విడిపోయి జీహెచ్‌ఎంసీ, సిద్దిపేట జిల్లా మర్కూక్‌లకు వెళ్లింది. హైదరాబాద్‌లోని పూల్‌బాగ్, అల్‌జుబేల్‌ కాలనీ, ఘాజి మిల్లత్‌ కాలనీ, బాలాపూర్, హఫీజ్‌బాబానగర్, గగన్‌పహాడ్‌ తదితర ప్రాంతాల్లో ఇళ్లు, దెబ్బతిన్న రోడ్లు, తెగిన చెరువులను పరిశీలించింది. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. పూల్‌బాగ్‌ వద్ద హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కేంద్ర బృందానికి వరదల వల్ల జరిగిన నష్టాన్ని వివరించారు. ఆర్‌ఓబీ, చెరువు కట్టల మరమ్మతులు, నాలా నుంచి తొలగిస్తున్న పూడికతీత తదితర పనుల్ని కూడా బృందం పరిశీలించింది. ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చెరువుల పటిష్టతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించింది. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జా, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి, చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌ అశోక్‌ సామ్రాట్‌ తదితర అధికారులు కేంద్ర బృందం వెంట ఉన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా