కడియం శ్రీహరి దళిత దొర.. దొంగే దొంగ అన్నట్లు ఉంది: ఎమ్మెల్యే రాజయ్య

30 Aug, 2022 17:42 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: తెలంగాణ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ నేత కడియం శ్రీహరి తనపై చేసిన అభియోగాలపై తీవ్రంగా స్పందించారు స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. మంగళవారం సాయంత్రం వరంగల్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. ఈ వ్యవహారంపై స్పందించారు. 

స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం పక్కా నా అడ్డానే. కడియం శ్రీహరి నా మీద చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. 14 ఏళ్లుగా మంత్రిగా పని చేసిన కడియం శ్రీహరి స్టేషన్‌ ఘన్‌పూర్‌కు ఏం చేశారు?. కడియం తీరు గురువింద సామెతలా ఉంది. దొంగే దొంగ అన్నట్లుగా ఉంది. కడియం శ్రీహరికి దళిత దొర అనే పేరుంది. అవినీతితో ఆస్తులు సంపాదించింది ఆయనే. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్సార్‌ నాకు రాజకీయ గురువు. అలాగే.. 

కేసీఆర్‌ తనకు దేవుడని, ఆయన ఆశీస్సులతో కాళోజీ హెల్త్‌ యూనివర్సిదొటీ తేవడంతో పాటు గ్రాస్‌ రూట్‌లో ఉన్న వైద్యవిధానాన్ని.. క్షేత్రస్థాయిలో చూశా గనుక ప్రక్షాళన చేయాలని ఆనాడు ప్రయత్నించానని రాజయ్య చెప్పుకొచ్చారు. కాకిలా కలకలం కాకుండా.. కోకిలలా కొంతకాలం ఉండి ప్రజామెప్పు పొందానని అన్నారు. రాజకీయ ఆరోపణలు.. విమర్శలు, మీడియాలో వచ్చిన అసత్య కథనాలతో తెలంగాణ అభాసుపాలు కావొద్దన్న ఉద్దేశంతో.. కేసీఆర్‌ వీరవిధేయుడిగా ఆయన మాట మీద ఆనాడు పదవి నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చారు రాజయ్య. 

ఇదిలా ఉంటే.. కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య  సంచలన ఆరోపణలు చేయగా, కౌంటర్‌గా ఇవాళ కడియం మాట్లాడుతూ.. స్టేషన్‌ ఘనపూర్‌ నీ జాగిరి కాదు అంటూ రాజయ్యపై మండిపడ్డారు.

ఇదీ చదవండి: ‘ఒళ్లు దగ్గర పెట్టుకో..’ తాటికొండ రాజయ్యపై కడియం శ్రీహరి ఫైర్‌

మరిన్ని వార్తలు