Telangana RTC: తెలంగాణ ఆర్టీసీకి గి‘రాఖీ’.. భారీగా ఆదాయం.. ఏకంగా..!

14 Aug, 2022 03:54 IST|Sakshi

ఒక్క రోజు రూ.20 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాఖీ పౌర్ణమి నేపథ్యంలో రోజువారీ టికెట్‌ ఆదాయం రూ.20 కోట్లు దాటాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్టీసీ అనుకున్నది సాధించింది. ఆగస్టు చాలెంజ్‌ పేరుతో తనకు తాను సవాలు విసురుకుని దాన్ని అధిగమించి చూపింది. రాఖీ పౌర్ణమి రోజు టికెట్‌ రూపంలో ఏకంగా రూ.20.10 కోట్ల ఆదాయాన్ని పొంది ఆల్‌టైం రికార్డు సృష్టించింది. ఉమ్మడి ఆర్టీసీలో ఓరోజు టికెట్‌ ఆదాయం రూ.21 కోట్ల రికార్డు కాగా, ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక ఏర్పడ్డ టీఎస్‌ఆర్టీసీ ఒక్కటే దానికి అతి చేరువగా వచ్చి సత్తా చాటింది.

ఇదే రోజు అటు ఏపీఎస్‌ఆర్టీసీ రూ.19.79 కోట్ల ఆదాయాన్ని పొందింది. విస్తృత పరిధి ఉన్న ఏపీఎస్‌ఆర్టీసీ కంటే ఎక్కువ ఆదాయాన్ని పొంది టీఎస్‌ఆర్టీసీ కొత్త మైలురాయిని దాటింది. ఈ నెల 12న 38,76,824 మంది ప్రయాణికులను బస్సులు గమ్యస్థానాలకు చేర్చా­యి. ఏకంగా 35.54 లక్షల కి.మీ. మేర బస్సులు తిరిగాయి. ఎన్నడూలేనట్టు కి.మీ.కి రూ.56.56 చొప్పున ఆదాయాన్ని సంస్థ నమోదు చేసుకుంది.

వెరసి 86.84 శాతం ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసుకుంది. కరీంనగర్‌ జోన్‌ పరిధిలో రూ.8.79 కోట్లు, హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో రూ.5.84 కోట్లు, గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీ జోన్‌ పరిధిలో రూ.5.47 కోట్ల ఆదాయం సమ ూరింది. రాఖీ పౌర్ణమితో పాటు వివాహాది శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో బస్సులు కిటకిటలాడాయి. ముందుగానే ఈ రద్దీని ఊహించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉద్యోగులకు ఆగస్టు ఛాలెంజ్‌ పేరుతో లక్ష్యాన్ని 
నిర్ధారించారు.     

మరిన్ని వార్తలు