మళ్లీ కొత్త రికార్డులు

20 Dec, 2023 00:57 IST|Sakshi

సెన్సెక్స్‌ 122 పాయింట్లు ప్లస్‌

ముంబై: ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్‌అండ్‌గ్యాస్, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీ లు ఒక రోజు నష్టాల ముగింపు తర్వాత మళ్లీ లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలూ కలిసొచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 122 పాయింట్లు పెరిగి 71,437 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్లు బలపడి  21,453 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అమ్మకాల ఒత్తిడి కి లోనయ్యాయి.

అయితే వెయిటేజీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐటీసీ, నెస్లే షేర్లు ఒక శాతం రాణించడంతో సూచీలు నష్టాలు భర్తీ చేసుకోవడంతో పాటు లాభాలు ఆర్జించగలిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 309 పాయింట్లు పెరిగి 71,624 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు బలపడి 21,505 వద్ద కొత్త చరిత్రాత్మక గరిష్టాలు నమోదు చేశాయి. మరో వైపు ఐటీ, ఆటో, మెటల్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లో నయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.603 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.294 కోట్ల షేర్లను కొన్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ సరళతర ద్రవ్య విధాన వైఖరికి మొగ్గుచూపడంతో ఆసియా మార్కెట్లు ఒక శాతం లాభపడ్డాయి. యూరోజోన్‌ ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు యూరప్‌ మార్కెట్లు పరిమిత లాభాల్లో కదలాడాయి. 

► ‘‘స్టాక్‌ మార్కెట్లో ఆశావాదం కొనసాగింది. స్థిరీకరణ దశలో భాగంగా సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఎర్ర సముద్రం నౌకా మార్గానికి రక్షణ కల్పిస్తామంటూ అమెరికా ప్రకటనతో క్రూడాయిల్‌ ధరల్లో స్థిరంగా నెలకొంది. వృద్ధి ఆధారిత స్టాకుల ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు వినిమయ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్విసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.  

► పెట్రోలియం క్రూడ్, డిజిల్‌పై ప్రభుత్వం విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో ఆయిల్‌అండ్‌గ్యాస్‌ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.50%, ఓఎన్‌జీసీ, హిందూస్తాన్‌ పెట్రోలియం, బీపీసీఎల్, ఐఓసీ, పెట్రోనెట్‌ షేర్లు ఒకటి నుంచి అరశాతం చొప్పున పెరిగాయి.  

►భారత ఐటీ కంపెనీలపై ప్రభావం చూపే అమెరికా దిగ్గజ ఐటీ కన్సల్టింగ్‌ సంస్థ యాక్సెంచర్‌ ఆర్థిక సంవత్సరం 2024 తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటన(మంగళవారం)కు ముందు దేశీయ ఐటీ షేర్లలో అప్రమత్తత చోటు చేసుకొంది. కోఫోర్జ్‌ 3%, విప్రో 2%, టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్, టెక్‌ మహీంద్రా షేర్లు ఒకశాతం పతనమయ్యాయి. ఎంఫసీస్, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీఎం షేర్లు అరశాతం నష్టపోయాయి. 

► షేర్ల విభజన రికార్డు తేది జనవరి 5 గా నిర్ణయించడంతో నెస్లే ఇండియా షేరు 4.50% లాభపడి రూ.25,485 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5.50% పెరిగి రూ.25,699 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది.

>
మరిన్ని వార్తలు