‘అంచె’లంచెలుగా ప్రక్షాళన!

22 Dec, 2021 03:28 IST|Sakshi

ఆర్టీసీ బస్‌భవన్‌లో అంచెలస్థాయిపై ఎండీ అధ్యయనం 

ఫైళ్ల పెండింగ్‌కు అంచెలే కారణమనే నిర్ధారణ 

కొన్ని పోస్టులు రద్దు చేస్తూ అధికారులకు స్థానచలనం 

అవసరమైన చోట్ల వారి సేవల వినియోగం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో అంచెలంచెల ప్రక్షాళన మొదలైంది. ఆయా విభాగాల్లోని అంచెల్లో ఫైళ్లు చిక్కుకుని ఒక పట్టాన పరిష్కారం కావడంలేదని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జనార్‌ గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్‌భవన్‌లో రెండంచెల అధికారుల వ్యవస్థ మాయంకానుంది. ఇక్కడ ఆయా విభాగాల్లో రెండంచెలను తొలగించినా పనులకు ఇబ్బంది ఉండదనే అంచనాకు వచ్చారు. అనవసరంగా ఉన్న అధికారులను అక్కడి నుంచి తొలగించి అవసరమైనచోట వారికి పనులు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏ అంచెలను తొలగించాలో ఈ నెల 24 లోగా తేల్చిచెప్పాలంటూ ఈడీలను ఆదేశించారు.  

ఇలా మొదలైంది..: ఐటీ విభాగానికి సంబంధించి గతంలో ఆదేశించిన ఓ పని గురించి ఎండీ వాకబు చేశారు. అది ఫలానా విభాగానికి పంపానని ఉన్నతాధికారి తెలపగా, ఆ విభాగాధికారిని అడిగితే.. రిమార్క్స్‌ కోసం ఫైల్‌ను కింది విభాగానికి పంపానన్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎండీ.. ఒకే భవనంలో ఉండే అధికారులు అప్పటికప్పుడు ఫోన్లలో మాట్లాడుకుని క్లియ ర్‌ చేయాల్సిన పనుల్లో కూడా ఫైల్‌ మూవ్‌మెంట్‌ పేరుతో కాలయాపన చేయటం ఏంటని ప్రశ్నించా రు. ఒకరిద్దరు అధికారులు చూసి క్లియర్‌ చేసే వాటిని కూడా రకరకాల విభాగాలకు పంపి రోజుల తరబడి ఎదురు చూడటం సరికాదని భావించి ఈ అంచెల వ్యవస్థ రద్దు నిర్ణయానికి వచ్చారు. 

ఇవీ విభాగాలు..: ఓపీడీ సీటీఎం, పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌లో సీపీఎం, ఇంజనీరింగ్‌ విభాగంలో సీఎంఈ, ఎకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌లో సీఏవో, సీటీఎం మార్కెటింగ్, సీటీఎం కమర్షియల్‌ పేరుతో విభాగాధిపతులున్నారు. ఈ పోస్టులు ఈడీ అడ్మినిస్ట్రేషన్, ఈడీ ఆపరేషన్స్, ఈడీ ఇంజనీరింగ్, ఈడీ రెవెన్యూ విభాగాల కింద ఉన్నాయి. ఈ విభాగా ల్లోని సూపర్‌వైజర్‌ కేడర్‌లో ఐటీ విభాగం ప్రక్షాళన పూర్తిచేశారు.

ఐటీ విభాగానికి ఓ ఈడీ ఉండేవారు. ఇక నుంచి ఈడీ ఉండరు. నేరుగా సీఈ ఎండీకి రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో రెండంచెలుంటే చాలన్న తరహాలో ఎండీ యోచిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏ అంచె ను తగ్గించాలన్న విషయంలో తర్జనభర్జన జరుగుతోంది. ఈడీ, ఆ తర్వాత విభాగాధిపతి పోస్టులు రెండు అవసరం లేదని, కింది అంచెల్లోనే ప్రధాన పని పూర్తవుతున్నందున.. పై స్థాయిలో ఒకే అంచె ఉంటే చాలన్నది ఓ అభిప్రాయం. కిందిస్థాయిలో ఒకే అంచె ఉంటే చాలన్నది మరో అభిప్రాయం. తుది నిర్ణయం ఎండీ తీసుకోవాల్సి ఉంది.

ఫీల్డ్‌లోకి ఒక ఈడీని పంపే యోచన
ప్రస్తుతం ఆర్టీసీలో ఐదుగురు ఈడీలు పనిచేస్తున్నారు. బస్‌భవన్‌లో ముగ్గురుండగా, కరీంనగర్‌–హైదరాబాద్‌ జోన్‌లను పర్యవేక్షించే మరో ఈడీ ఇమ్లీబన్‌ బస్టాండులో, గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ను పర్యవేక్షించే ఈడీ జూబ్లీ బస్టాండ్‌లో ఉంటారు. మొత్తంగా ఐదుగురు ఈడీలు హైదరాబాద్‌లోనే ఉంటారు. దీంతో ఒకరు జిల్లాల్లో ఉంటే బాగుంటుందని ఎండీ యోచిస్తున్నారు. ఆ మేరకు ఒకరిని క్షేత్రస్థాయిలో ఉండేలా పంపే వీలుందని సమాచారం.

మరిన్ని వార్తలు