అక్రమాల తూనిక... చర్యలు లేవింక

22 Dec, 2021 03:23 IST|Sakshi

తూనికలు, కొలతల శాఖలో ఇద్దరు అధికారులకు విజిలెన్స్‌ ఉచ్చు 

చేతివాటం, బోగస్‌ వ్యవహారం, అధికార దుర్వినియోగం వెలుగులోకి

చర్యలు తీసుకోవాలని సర్కారుకు విజిలెన్స్‌ విభాగం సిఫార్సు

ఏసీబీ సమగ్ర నివేదిక కోరిన ప్రభుత్వం.. రెండు నెలలైనా సమర్పించని వైనం

సాక్షి, హైదరాబాద్‌: తూనికలు కొలతల శాఖలోని ఇద్దరు ఉన్నతాధికారులకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ ఉచ్చు బిగుసుకుంది. సాక్షాత్తు మాజీ అధికారుల ఫిర్యాదులో రంగంలోకి దిగిన విజిలెన్స్‌ విభాగం.. ఆ అధికారులు అధికార దుర్వినియోగం చేశారని, చేతివాటం ప్రదర్శించారని, అక్రమంగా పదోన్నతులు కల్పించారని, ఫోర్జరీ చేశారని నిగ్గు తేల్చింది. ఆ ఇద్దరు ప్రాంతీయ డిప్యూటీ కంట్రోలర్లు (ఆర్‌డీసీ)లతో పాటు ఓ టెక్నికల్‌ అసిస్టెంట్‌లపై క్రిమినల్‌ కేసులు, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సర్కారుకు సిఫార్సు చేసింది. దీనిపై సమగ్ర నివేదక ఇవ్వాలని ఏసీబీని ప్రభుత్వం ఆదేశించింది. 

అధికారం ఉందని..
రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ నగరానికి చెందిన తూనికలు, కొలతల పరికరాలకు సంబంధించిన మూడు సంస్థలు తమ లైసెన్స్‌ల పునరుద్ధ్దరణ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అప్పట్లో లైసెన్స్‌ రెన్యువల్‌ అధికారం రాష్ట్ర కంట్రోలర్‌కే ఉండగా ప్రాంతీయ డిప్యూటీ కంట్రోలర్‌ (హెడ్‌ క్వార్టర్స్‌) అధికార దుర్వినియోగం చేసినట్టు బహిర్గతమైంది. దీంతో ఐపీసీ సెక్షన్‌ కింద క్రిమినల్‌ కేసులు, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజిలెన్స్‌ బృందం సిఫార్సు చేసింది.

లేనిది ఉన్నట్లుగా...: కారుణ్య నియామకాల కింద భర్తీ అయిన చౌకిదార్‌కు లేని ధ్రువీకరణ పత్రం ఉన్నట్లు సృష్టించి మ్యానువల్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌గా డబుల్‌ పదోన్నతి కల్పించడాన్ని విజిలెన్స్‌ విభాగం తప్పుబట్టింది. 2013లో జడ్చర్లలో పనిచేసే చౌకిదార్‌కు సాంకేతిక (వర్క్‌ షాప్‌) అనుభవం లేకున్నా అప్పటి డిప్యూటీ కంట్రోలర్‌ (ప్రస్తుతం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్, హెడ్‌ క్వార్టర్స్‌).. లేని అధికారాన్ని వాడి సర్వీస్‌ బుక్‌లో ఆ విషయాలు నమోదు చేసినట్లు విజిలెన్స్‌ విచారణలో బయటపడింది.

అప్పటి నల్లగొండ– మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి (ప్రస్తుతం డిప్యూటీ కంట్రోలర్, హైదరాబాద్‌ రీజియన్‌) పైనా ఒత్తిడి చేసినట్లు వెల్లడైంది. సర్వీస్‌ బుక్‌లో ఏమైనా నమోదు చేసే అధికారం జిల్లా అసిస్టెంట్‌ కంట్రోలర్‌కే ఉంటుంది. దీంతో ఆ ఇద్దరు అధికారులతో పాటు అక్రమంగా పదోన్నతి పొందిన టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఇటీవల మృతి చెందారు)పై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ సిఫార్సు చేసింది.

ఇంతవరకూ నివేదిక ఏదీ?
తూనికలు, కొలతల శాఖ అధికారులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆగస్టు 5న సమర్పించిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి (పౌరసరఫరాల విభాగం) విజిలెన్స్‌ సిఫార్సులపై సమగ్ర నివేదిక సమర్పించాలని సెప్టెంబర్‌ 14న అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ను కోరారు. కానీ ఇంతవరకూ ఏసీబీ నివేదిక ప్రభుత్వానికి అందనట్లు తెలుస్తోంది. దీంతో అవినీతి నిరోధక శాఖ నివేదిక ఆలస్యంపై అనుమానాలు కలుగుతున్నాయి. 

మరిన్ని వార్తలు