మానవత్వం మరుస్తున్నామా...నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు..కానీ ఒక్కరూ...

8 Dec, 2022 10:41 IST|Sakshi

‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ’ అంటూ రాసిన అందెశ్రీ ఇది చూసి ఉంటే ‘అసలెక్కడున్నడమ్మా మనిషన్నవాడూ’ అంటూ అక్షరాలా ఆవేదన చెందకమానరు.. 

సాక్షి, బంజారాహిల్స్‌: సాటి మనిషి శవమై నడిరోడ్డుపై పడుంటే పక్కనుంచే ఏమీ పట్టనట్టు పోతున్న మనుషుల్ని చూస్తే అసలు వీరు..బతికున్నారా? అనిపించకమానదు. ఉసురు పోయినా పట్టక ఉరుకులూ పరుగులు తీస్తున్న మనిషీ ఊపిరి ఉన్నంత వరకే ఈ ‘సిరి’ అని మరిచావా అని అరవాలనిపించకమానదు. ఒక కాకి చనిపోతే వంద కాకులు గుమికూడి విలపించినట్టు హైరానా పడతాయి.

కానీ మన నగరవాసి మంత్రం రెండు కిలో మీటర్ల దూరంలో ఇద్దరు వ్యక్తులు రోడ్ల పైన చచ్చిపడి ఉన్నా పట్టించుకోలేదు. ఎందుకిలా జరిగి ఉంటుందని ఆగి చూసే ఓపిక లేకుండా పోయింది. రోడ్డు పైన పడి ఉన్న శవాల పక్క నుంచే వందలాది మంది వెళ్తున్నారు తప్ప పోలీసులకో, ప్రభుత్వ యంత్రాంగానికో సమాచారం ఇద్దామనే ఆలోచన, ఓపిక కూడా లేదు. సంపన్నులు నివసించే బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రివద్ద, జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌ స్కూల్‌ వద్ద బుధవారం రెండు గుర్తు తెలియని వ్యక్తుల శవాలు పడి ఉన్నాయి. వీరు ఎలా చనిపోయారో..ఎప్పుడు చనిపోయారో తెలియలేదు.

రోడ్డుపైన, ఫుట్‌పాత్‌పైన నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు. దాదాపు 12 గంటలు గడిచాక..ఎవరో ఓ వ్యక్తి ఎట్టకేలకు వారు నిద్రించడం లేదు...చనిపోయారని గుర్తించి డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. ఈలోపే మరొకరెవరో ఆ శవంపై నుంచి వాహనాలు వెళ్లకుండా ఓ రాయిని, ఓ కర్రను అడ్డంగా పెట్టి వెళ్లిపోయాడు. ఇక వాహనదారులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. కనీసం ఇక్కడ విధులు నిర్వర్తించే జీహెచ్‌ఎంసీ సిబ్బంది కూడా ఈవిషయాన్ని గుర్తించ లేదు. చివరకు మధ్యాహ్నం వేళ పోలీసులు వచ్చి..అనాథ శవాలుగా కేసు నమోదు చేసి...మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. 
(చదవండి: ఫాంహౌజ్‌ కేసు: బెయిల్‌పై విడుదల, ఆ వెంటనే మళ్లీ అదుపులోకి..)

మరిన్ని వార్తలు