సీఎం కేసీఆర్‌ పుట్టిపెరిగింది ఇక్కడే.. | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ పుట్టిపెరిగింది ఇక్కడే..

Published Thu, Nov 16 2023 6:20 AM

- - Sakshi

దుబ్బాకటౌన్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచింది దుబ్బాక. విప్లవోద్యమాలకు .. తెలంగాణ ఉద్యమానికి కీలకభూమిక పోషించింది.. ఒకే నియోజకవర్గం నుంచి 4 నక్సలైట్‌ దళాలు (దుబ్బాక, ఇందుప్రియాల్‌, గిరాయిపల్లి పీపుల్స్‌వార్‌ దళాలు, జనశక్తి కూడవెల్లి దళం) కార్యకలాపాలు సాగించి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది.

అలాగే, సీఎం కేసీఆర్‌కు విద్యాబద్ధులు నేర్పిన గడ్డ, తెలంగాణ ఉద్యమంలోనూ వందలాది కేసులతో జైలు జీవితాలు అనుభవించిన వారితోపాటు పదుల సంఖ్యలో అమరులైన పోరాటాల గడ్డగా దుబ్బాకను చెప్పవచ్చు. నియోజకవర్గంలోని తొగుట మండలంలో నిర్మించిన కొమరవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌తో పదికిపైగా నివాస గ్రామాల ప్రజలు తరతరాల నుంచి ఉన్న ఊళ్లూ, పుట్టిపెరిగిన ఇళ్లు, భూములను వదిలి చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు.

► సీఎం కేసీఆర్‌ విద్యాబుద్ధులు ఇక్కడే..
సీఎం కేసీఆర్‌ ఓనమాలు నేర్చింది దుబ్బాకలోనే. దుబ్బాకకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న (ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న చింతమడక) నుంచి తన సోదరితో కాలినడకన నడుచుకుంటూ వచ్చి చదువుకున్నారు. దుబ్బాకలోనే 3 నుంచి 10 వ తరగతి చదువుకున్నారు. దుబ్బాకలో కేసీఆర్‌కు చదువుచెప్పిన గురువులతోపాటు తనతోపాటు చదువుకున్న మిత్రులను ఇప్పటికీ పేరుపెట్టి పిలుస్తుంటారు. తాను చదువుకున్న పాఠశాల శిథిలావస్థలో ఉండడంతో రూ.12 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరి చేయించి అధునాతన హంగులతో కొత్త భవనం నిర్మించారు.

ఉపఎన్నికల్లో రఘునందన్‌రావు గెలుపు..
అనారోగ్యంతో ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో 2020లో దుబ్బాకలో ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్‌రావు గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఈ గెలుపుతో రాష్ట్రంలో బీజేపీకి మంచి ఊపు వచ్చింది. దుబ్బాక ఫలితంలో రాజకీయంగా తెలంగాణలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

నక్సలైట్‌, జర్నలిస్టు నుంచి..
నక్సలైట్‌గా.. జర్నలిస్టు స్థాయి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి. చిట్టాపూర్‌కు చెందిన రామలింగారెడ్డి దుబ్బాకలో ఇంటర్‌ చదువుకుంటున్న కాలంలోనే విప్లవోద్యమాల బాట పట్టి రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడితోపాటు పలు స్థాయిల్లో పనిచేయడంతోపాటు పీపుల్స్‌వార్‌ కేంద్ర, రాష్ట్ర కమిటీలోని చాలామంది నేతలతో సంబంధాలు నడిపాడు. జర్నలిస్టుగా 20 ఏళ్లు పని చేశారు.

ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి..
ఎన్నికల ప్రచారంలో తాజాగా దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఎంపీపై దాడి రాష్ట్ర రాజకీయాల్లోనే ఓ దుమారం లేపింది. ప్రతిపక్ష పార్టీలు ఎంపీపై పథకం ప్రకారమే దాడి చేయించారంటూ సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే. ఈ ఘటన ప్రస్తుత ఎన్నికల సమయంలో జరగడంతో తీవ్ర సంచలనంగా మారింది. ఇవే కాదు రాష్ట్రవ్యాప్తంగా అనేక ఘటనలకు దుబ్బాక నియోజకవర్గం కేంద్రబిందువుగా మారింది.

Advertisement
Advertisement