ఆఖరి మజిలీలో ఆత్మీయ స్పర్శ

10 Oct, 2020 09:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేన్సర్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి, చికిత్స లేని వ్యాధులతో అవసాన దశలో ఉన్న వారికి ఇచ్చే శారీరక, మానసిక ఉపశమన చికిత్సే ‘హస్పీస్‌ అండ్‌ పాలియాటివ్‌ కేర్‌’గా పేర్కొంటారు. చివరి దశలో ఉన్న కేన్సర్‌ బాధితులకు 9 సంవత్సరాలుగా నగరంలోని ‘స్పర్శ్‌ హస్పీస్‌ అండ్‌ పాలియాటివ్‌ కేర్‌ సెంటర్‌’ అందిస్తున్న ఉచిత సేవలపై నేడు వరల్డ్‌ హస్పీస్‌ అండ్‌ పాలియాటివ్‌ కేర్‌ డే సందర్భంగా కథనం.. 

ఆస్పత్రిలో ఉన్నా నయం కాదు.. అలాగని ఇంటి దగ్గర వారి నొప్పులకు ఉపశమనం దొరకదు. ఈ పరిస్థితుల్లో జీవితం నరకప్రాయంగా మారిన కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధి బాధితులు ఎందరో.. అలాంటి వారికి శారీరక, మానసిక సాంత్వనకు ప్రత్యేకంగా అందించే చికిత్స పేరే ‘పాలియాటివ్‌ కేర్‌ ట్రీట్‌మెంట్‌’. అయితే ప్రత్యేకంగా పాలియాటివ్‌ కేర్‌ సేవలు ఉంటాయని తెలియక ఎందరో అవస్థలతో, నొప్పులతోనే తుది శ్వాసకు చేరువవుతున్నారు. కేవలం నగరంలోనే ప్రతినెలా 20 వేల వరకు ఇలాంటి కేసులు బయటపడుతున్నాయని డాక్టర్ల అంచనా.. వీటిలో కేవలం 1 శాతం మంది మాత్రమే పాలియాటివ్‌ కేర్‌ సేవలు పొందగలుగుతున్నారు.

రోగుల సేవలో తొమ్మిదేళ్లుగా.. 
కేన్సర్‌ మహమ్మారితో పోరాడుతూ చివరి దశలో ఉన్న వారికి ఉపశమన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో 2011లో రోటరీ క్లబ్‌ బంజారాహిల్స్‌ ఆధ్వర్యంలో ‘స్పర్శ్‌ హస్పీస్‌ అండ్‌ పాలియాటివ్‌ కేర్‌ సెంటర్‌’ ఏర్పాటైంది. ఈ ఆస్పత్రి పూర్తి ‘ఉచితంగా’ హస్పీస్‌ అండ్‌ పాలియాటివ్‌ కేర్‌ సేవలను అందిస్తోంది. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 3,100 మందికి సేవలను అందించారు. నగరం నుంచే కాకుండా రెండు రాష్ట్రాల ప్రజలు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. పాలియాటివ్‌ కేర్, కేన్సర్‌ మహమ్మారిపై మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.

అన్ని రకాల సదుపాయాలూ... 
ఈ సెంటర్‌లో పేషెంట్లకు కావాల్సిన అన్ని రకాల మెడికల్‌ సదుపాయాలతో పాలియాటివ్‌ కేర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్లు, కౌన్సెలింగ్‌ స్పెషలిస్ట్, నర్స్‌లు, సోషల్‌ వర్కర్స్‌ నిత్యం సేవలు అందిస్తుంటారు. దీని కోసం ప్రత్యేకంగా  టీమ్‌ ఏర్పాటు చేశారు. నొప్పులు, ఆయాసం నుంచి స్వస్థతకు మెడికల్‌ ట్రీట్‌మెంట్‌తో పాటు వారికి నిర్ధేశించబడిన అనువైన ఆహారాన్ని అందిస్తారు. దుర్భరప్రాయమైన అవసానదశలో ఎదురయ్యే వాంతులు, రక్తస్రావాలకు ప్రేమతో సపర్యలు చేస్తారు. అంతేగాకుండా అవసాన దశలో ఉన్న వారికి, వారి కుటుంబ సభ్యులకు కావాల్సిన మానసిక, ఆధ్యాత్మిక స్థైర్యాన్ని కౌన్సెలింగ్‌ ద్వారా అందిస్తారు.  

మేమే వస్తాం.. 
వివిధ కారణాల వలన ఈ సెంటర్‌కి రాలేని వారి కోసం స్పర్శ్‌ టీం బృందాలుగా వారి ఇళ్లకే వెళ్లి ట్రీట్‌మెంట్‌ ఇవ్వడమే కాకుండా అవసరమైన మెడికల్‌ కిట్స్‌ ఇతర అవసరాలైన డైపర్స్, హెల్త్‌ న్యూట్రియంట్స్‌ తదితరాలను అందిస్తారు. ఇలా నగర పరిధిలో 40 కిలో మీటర్ల వరకు ఎక్కడికైనా వెళ్లి సేవలు అందిస్తారు. మరికొందరు ఔట్‌పేషెంట్‌ సేవలు పొందుతున్నారు. 

అన్నీ తామై.. 
కుల మతాలకతీతంగా అన్ని పండగలను నిర్వహిస్తారు. రోగుల పుట్టిన రోజులు జరుపుతూ, చివరి కోరికలు తీరుస్తూ ఆటలు పాటలతో నచ్చిన పని చేసుకునేందుకు అన్నీ సమకూరుస్తారు. ఇక్కడికి వచ్చే పేషంట్లకు, వారి అటెండర్లకు వసతి, భోజన సౌకర్యాలు అందిస్తారు. ఈ సేవలో ఎందరో దాతలు, స్వచ్ఛంద సేవకులు భాగం పంచుకుంటున్నారు.  

గౌరవప్రదమైన మరణం సాంత్వనతో కూడిన
జీవితం, గౌరవప్రదమైన మరణం అనే లక్ష్యాలతో స్పర్శ్‌ సిబ్బంది పనిచేస్తున్నాం. చివది దశలో ప్రశాంతమైన జీవితం ఇవ్వాలనేదే మా ధ్యేయం.. మరికొన్ని రోజుల్లోగచ్చిబౌలిలో 75 పడకలతో పాలియాటివ్‌ కేర్‌ సెంటర్‌లో సేవలు అందించే దిశగాముందుకెళ్తున్నాం.  – రామ్మోహన్‌రావు, సీఈఓ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు