అన్నా.. నేను రాఖీ ఎవరికి కట్టాల్నే..

12 Aug, 2022 08:48 IST|Sakshi
సంకీర్త్‌ (ఫైల్‌).. విషణ్ణవదనంలో ఉపాసన 

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): ‘అన్నా.. నువు నన్ను వదిలి వెళ్లిపోయావు.. నేను రాఖీ ఎవరికి కట్టాల్నే.. ఈ రోజే రాఖీ కొని తీసుకువచ్చాను.. ఒక్కగానొక్క అన్నవు.. నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోతే ఎలా.. అన్నా..’ అంటూ మృతుడి సోదరి ఉపాసన రోదించిన తీరు కంటతడి పెట్టిచ్చింది. సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై ఉపేందర్‌రావు వివరాల ప్రకారం.. 

సుల్తానాబాద్‌లో పని ఉండడంతో..
కరీంనగర్‌ నగరంలోని మధీరనగర్‌(బొమ్మకల్‌)కు చెందిన నగపూరి ప్రదీప్‌కుమార్‌–స్వాత్విక దంపతులకు కుమారుడు సంకీర్త్‌(16), ఉపాసన సంతానం. సంకీర్త్, హౌసింగ్‌బోర్డుకు చెందిన చీయజ్‌ ఓం, మల్యాల శివమణి ముగ్గురూ మంచి స్నేహితులు. చీయజ్‌ ఓంకు సుల్తానాబాద్‌లో పని ఉండటంతో ముగ్గురూ కలిసి గురువారం ద్విచక్రవాహనంపై బయలుదేరారు. సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి గ్రామశివారులో రాజీవ్‌రహదారిపై వీరి బైక్‌ను ట్రాలీవ్యాన్‌ ఢీకొనడంతో సంకీర్త్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. ఓం, శివమణిలకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది.

చదవండి: (వాట్సాప్‌లో న్యూడ్‌ కాల్‌.. బ్లాక్‌మెయిల్‌)

గాయపడినవారిని పోలీసులు కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సుల్తానాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. రాఖీ పండుగకు ఒకరోజు ముందుగానే సోదరుడు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో మృతుడి చెల్లి గుండలవిసేలా రోదించింది. సంకీర్త్‌ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

మానవత్వం చాటిన పోలీసులు
రోడ్డు ప్రమాద సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కానిస్టేబుళ్లు తిరుపతినాయక్, అశోక్, రమేశ్, రాజు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఓం, శివమణిలను పోలీసువాహనంలోనే కరీంనగర్‌కు తీసుకెళ్లి ఆస్పత్రి లోపలికి ఎత్తుకొని తీసుకెళ్లారు. సంకీర్త్‌ మృతదేహాన్ని మోసుకొచ్చి పోస్టుమార్టం రూంలో పెట్టడంతో వారిని పలువురు అభినందించారు.

మరిన్ని వార్తలు