మూడు నెలల్లో 16 సార్లు పెంచుతారా? 

20 Oct, 2021 01:56 IST|Sakshi

పెట్రో ధరలు తగ్గించాలని యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్‌    

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని మోదీ సర్కారు మూడు నెలల్లో పదహారుసార్లు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం మోపిందని యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ మంగళవారం నాంపల్లి వద్ద తెలంగాణ యూత్‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా పెంచిన చమురు ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

ధరల్ని వెంటనే తగ్గించకపోతే యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ మెడలు వంచుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మోట రోహిత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సామ్రాట్, రాష్ట్ర కార్యదర్శులు రిషికేశ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు