పంట నష్టపరిహారం చెల్లించాలి : సీపీఎం

12 Nov, 2023 00:50 IST|Sakshi

పెబ్బేరు రూరల్‌: ఉమ్మడి వీపనగండ్ల మండలంలో సాగునీరందక వరి పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని.. పరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లాకేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎం ప్రతినిధి బృందం రైతులతో కలిసి పలు గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించిందని తెలిపారు. పీజేపీ ప్రధాన ఎడమ కాల్వ చివరి ఆయకట్టుకు సాగునీరందక వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లోని తూముకుంట, సంపట్రావ్‌పల్లి, కొండూరు, సింగోటం, కొప్పునూర్‌, పెద్దమారూర్‌, పెద్దదగడ, చెల్లెపాడు, అయ్యవారిపల్లి, కాలూరు, చిన్నమారూర్‌లో సుమారు 10 వేల ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోవడంతో గొర్రెలను మేపుతున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, నీటిపారుదలశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండిన వరి పంట ఎకరాకు రూ.35 వేలు, వాణిజ్య పంటలకు రూ.75 వేల నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్‌ చేస్తోందన్నారు. నష్టపరిహారం చెల్లించకుంటే రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు