సజావుగా ఎన్నికల నిర్వహణ

12 Nov, 2023 00:48 IST|Sakshi

వనపర్తి: నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల పరిశీలకుడు సోమేష్‌ మిశ్రా ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా ఎన్నికల అధికారి తేజస్‌ పవార్‌, ఎస్పీ రక్షిత కె.మూర్తి, పోలీస్‌ పరిశీలకుడు రాజీవ్‌ మల్హోత్రాతో కలిసి జిల్లాకేంద్రంలో పర్యటించారు. ముందుగా జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూంను పరిశీలించారు. సీసీటీవీ సర్వేలెన్స్‌, పోలీస్‌ భద్రతా వ్యవస్థ పనితీరును ఎస్పీ వారికి వివరించారు. స్థానిక ఉర్దూ మీడియం కళాశాలలో ఏర్పాటు చేసిన 102, 103 పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. మౌలిక వసతుల కల్పన తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిట్యాల శివారులోని వ్యవసాయ మార్కెట్‌ గోదాంలో ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద రక్షణ, నిఘా వ్యవస్థలను పరిశీలించారు. రిసెప్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ సిబ్బంది, రవాణా వ్యవస్థ పక్కాగా ఉండాలని, కౌంటర్లు, టేబుల్స్‌, బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ తేజస్‌ పవార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎలాంటి జాప్యం లేకుండా సజావుగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ఎన్నికల పరిశీలకుడు సోమేశ్‌ మిశ్రా

మరిన్ని వార్తలు