రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత ! | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత !

Published Mon, Nov 27 2023 1:48 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి 
నివాళులర్పిస్తున్న జేసీ గణేష్‌కుమార్‌  - Sakshi

జేసీ గణేష్‌కుమార్‌

కడప సెవెన్‌రోడ్స్‌: భారత రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యత అని జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం 74వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ ప్రాంగణంలోని భారతరత్న డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి జేసీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పందన హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి, అభ్యున్నతిని కాంక్షించి రచించిన రాజ్యాంగాన్ని 26 నవంబర్‌ 1949న జాతికి అంకితం చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్న విషయాన్ని అందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే రోజును జాతీయ న్యాయ దినోత్సవం, వరకట్న వ్యతిరేక దినోత్సవాలుగా కూడా నిర్వహించుకున్నామని తెలిపారు. త్యాగం, కృషి, సడలని పట్టుదల, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి, క్రమశిక్షణ, అకుంఠిత దీక్షాదక్షతలకు అంబేడ్కర్‌ నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. డీఆర్వో గంగాధర్‌ గౌడ్‌ భారత రాజ్యాంగంలోని పీఠికను చదివి వినిపించారు. అనంతరం భారతీయ జీవన గమనాన్ని ప్రతిబింబించే విలువైన సాధనం రాజ్యాంగం అని ఆ గ్రంథాన్ని, న్యాయ చట్టాల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు కౌసర్‌ భాను, ప్రత్యూష, మైనారిటీ కార్పోరేషన్‌ ఈడీ డాక్టర్‌ వల్లూరు బ్రహ్మయ్య, ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఈ మహేశ్వర్‌ రెడ్డి, కలెక్టరేట్‌ ఏవో విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement