పరిమళించిన ఆధ్యాత్మిక గంధం | Sakshi
Sakshi News home page

పరిమళించిన ఆధ్యాత్మిక గంధం

Published Mon, Nov 27 2023 1:48 AM

పెద్దదర్గా ఆవరణలో భక్తుల సందడి  - Sakshi

కడప కల్చరల్‌ : ఆ ప్రాంగణమంతా జనసందోహం..ప్రతి రోడ్డులోనూ దాదాపు 100 మీటర్లపాటు కిక్కిరిసిన జనం..అంతటా ఆద్యాత్మిక సుగంధం....అందరి మనసుల నిండా భక్తి..కడప అమీన్‌పీర్‌ దర్గా ఉరుసు ఉత్సవాల్లో ప్రధానంగా భావించే ఘట్టాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. హజరత్‌ సూఫీ సర్‌ మస్తాని చిల్లాకష్‌ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా మహమ్మద్‌ మహమ్మదుల్‌ హుసేనీ చిష్టివుల్‌ ఖాద్రీ సాహెబ్‌ ఉరుసు ఉత్సవాల్లో భాగంగా దర్గా పీఠాధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ తన నివాసం నుంచి అలంకరించిన గంధం కలశంతో ఫకీర్ల మేళతాళాలు, సాహస విన్యాసాల మధ్య ఊరేగింపుగా దర్గాలోని గురువుల మజార్‌ వద్దకు తరలి వెళ్లారు. గంధం సమర్పించి ఫాతెహా నిర్వహించారు. ముషాయిరా హాలులో దర్గా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంస్థల వార్షిక నివేదికతోపాటు అమీన్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు విశేషాలను, విజయాలను నిర్వాహకులు పీఠాధిపతికి సమర్పించారు. ఈ సందర్బంగా అమీన్‌ ఐటీఐలో ప్రతిభ చూపిన విద్యార్థుల గురించి ఐటీఐ ప్రతినిధులు వివరించారు. వారికి ఐదుగురికి ప్రశాంత పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు.

దీక్షలో మలంగ్‌షా

ఈ సందర్భంగా మలంగ్‌షాను పీఠాధిపతి దీక్ష వహింపజేశారు. దర్గా నుంచి కడపలోని ముఖ్య కూడళ్ల మీదుగా వెళ్లిన మలంగ్‌షా, అనుచర బృందం నాగరాజుపేటలోని బాదుల్లాసాహెబ్‌ మకాన్‌కు చేరింది. మకాన్‌ నిర్వాహకులు, స్థానిక భక్తులు వారిని స్వాగతించారు. సాయంత్రం ఆ బృందం ఊరేగింపుగా తిరిగి దర్గాకు చేరుకుంది. రాత్రి మలంగ్‌షా దర్గా ఆవరణంలోని పీర్లచావిడిలో దీక్ష వహించారు. దర్గా పీఠాధిపతి స్వయంగా వెళ్లి ఆయనకు సంప్రదాయబద్దంగా దీక్ష వహింపజేశారు.

భక్తులకు ఏర్పాట్లు

గంధం ఉత్సవానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిర్వాహకులు వారందరికీ వసతి, భోజన సౌకర్యం కల్పించారు. దుకాణాల వద్ద కూడా జనం సందడి కనిపించింది.

గంధం సమర్పించిన పీఠాధిపతి

గంధం, చాదర్‌ సమర్పిస్తున్న పీఠాధిపతి, 
చిత్రంలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా
1/1

గంధం, చాదర్‌ సమర్పిస్తున్న పీఠాధిపతి, చిత్రంలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

Advertisement
Advertisement