‘స్వచ్ఛత’లో  వెనుకంజ

7 Mar, 2019 11:37 IST|Sakshi

వెలువడిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులు

 ఆదిలాబాద్‌ బల్దియాకు 330వ స్థానం

గతంలో 133వ ర్యాంకు 

సాక్షి, ఆదిలాబాద్‌రూరల్‌: స్వచ్ఛ సర్వేక్షణ్‌–2019 ర్యాంకుల్లో ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఎంతో వెనుకబడింది. ఈ సారి జాతీయస్థాయిలో 330వ స్థానంలో నిలిచింది. గతంలో 133వ ర్యాంకులో ఉన్న మున్సిపాలిటీ ఈ సారి వెనక్కి వెళ్లింది. ఈ ఏడాది మైనస్‌ మార్కులు ఉండడంతో ర్యాంకుల్లో వెనుకబడ్డామని అధికారులు పేర్కొంటున్నారు.

 కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా నగరాలు, పట్టణాలను స్వచ్ఛమైన నివాస ప్రాంతాలుగా మార్చాలన్న లక్ష్యంతో మున్సిపాలిటీల్లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇది ఏ మేరకు అమలవుతుందో తెలుసుకునేందుకు 2017 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్‌ను ప్రారంభించింది. ఏటా జనవరిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ బృందం సభ్యులు పరిశుభ్రతను పరిశీలించి స్వచ్ఛతపై వివరాలు సేకరించిన తర్వాత మార్పులను బట్టి ర్యాంకు కేటాయిస్తారు. ఈ బృందం సభ్యులు కాలనీల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వివరాల సేకరణతోపాటు స్థానికుల నుంచి వివరాలు సేకరించి కేంద్రానికి పంపిస్తారు. ఈ వివరాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులను ప్రకటిస్తుంది. గతం కంటే ఈసారి మరిన్ని నిబంధనలు పొందుపర్చడంతో కొంత ర్యాంకు తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే గతంలో మైనస్‌ మార్కులు ఉండేవి కావు, ఈ సారి మైనస్‌ మార్కులు ఉండడంతో ర్యాంకులో వెనుకపడ్డట్లు తెలుస్తోంది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తగ్గిన ర్యాంకు..
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ 2017లో 195వ ర్యాంకు సాధించింది. 2018లో 2,423 మార్కులు సాధించి 133వ ర్యాంకు పొందింది. 2017తో పోలిస్తే 2018లో మెరుగైన ర్యాంకు సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2019లో ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో 330వ ర్యాంకు సాధించగా, రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించింది. 


వీటిలో మెరుగైతేనే..
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మార్పులు, మెరుగైన ర్యాంకు సాధించాలంటే మొదటగా ప్రత్యేక ప్రణాళిక రూపొదించుకోవాల్సి ఉంటుంది. ర్యాంకు సాధించుకోవాలంటే పట్టణ ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం తేవాలి. పారిశుధ్య సిబ్బంది మున్సిపాలిటీల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి. బహిరంగ మల, మూత్ర విసర్జనను వంద శాతం నిషేధించాలి. ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేలా చూడడంతోపాటు పారిశుధ్య కార్మికులు బాధ్యతగా చెత్తను ప్రతీ రోజు తీసుకెళ్లేలా చూడాలి. మున్సిపాలిటీల్లో తడి, పొడి చెత్త సేకరణకు ప్రజలకు రెండు చెత్త బుట్టలు అందించాలి. వాటి వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా ప్రజల నుంచి వివరాలను రాబడతారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందంలోని అధికారులు మున్సిపాలిటీ నాలుగు విభాలుగా విభజించి మార్కులు కేటాయిస్తారు. సర్వీస్‌ లెవల్‌ బెంచ్‌ మార్కులు 1250, థర్డ్‌ పార్టీ ఆఫీసర్ల పరిశీలన ద్వారా 1250 మార్కులు, సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ద్వారా 1250 మార్కులు, సర్టిఫికెట్, ఓడీఎఫ్‌ గ్యార్బేజీ, ప్రీసిటీ, కెపాసిటీ బిల్డిండ్‌ ద్వారా మరో 1250 మార్కులకు కేటాయించి ర్యాంకు ప్రకటిస్తారు.


మరిన్ని నిబంధనలు పొందుపర్చడంతోనే..
స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో గతంలో మైనస్‌ మార్కులు ఉండేవి కావు. ఈసారి మరిన్ని నిబంధనలు పొందుపర్చారు. దీంతో ర్యాంకు తగ్గింది. వచ్చే సంవత్సరం పట్టణ ప్రజలకు మరింత అవగాహన కల్పించి, మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం.  

  – మారుతిప్రసాద్, మున్సిపల్‌ కమిషనర్, ఆదిలాబాద్‌

మరిన్ని వార్తలు