110 కార్ల వర్‌‌కషాపులు బుగ్గి

16 Mar, 2015 07:31 IST|Sakshi
110 కార్ల వర్‌‌కషాపులు బుగ్గి

రాజధానిలో భారీ అగ్నిప్రమాదం
 
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని విజయనగర్ కాలనీలో ఉన్న ఐటీఐ గిల్డ్‌లో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గిల్డ్‌లో ఉన్న సుమారు 110 చిన్నాచితక కార్ల వర్క్‌షాపులు పూర్తిగా బుగ్గిపాలయ్యాయి. రూ.కోట్లలో ఆస్తి నష్టం సంభవించింది. లోపల ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద షార్‌‌ట సర్య్కూట్ కారణంగానే మంటలు ఎగిసి పడ్డాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికుల సహాయంతో మంటలను నాలుగు గంటల్లో అదుపులోకి తెచ్చారు.

ఆదివారం సెలవు దినం కావడంతో గిల్డ్‌లోని వర్క్‌షాపులన్నీ మూసి ఉన్నాయి. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రతి వర్క్ షాపులో ఇంజన్ ఆయిల్, కార్లకు ఉపయోగించే పెయింట్స్ పెద్ద మొత్తంలో నిల్వ ఉండడం, కుప్పలుగా టైర్లు ఉండడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. 16 ఫైర్‌ఇంజన్లతో పాటు మరో 20 నీళ్ల ట్యాంకర్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా గిల్డ్‌కు ఆనుకుని ఉన్న నాలుగు రోడ్లను పోలీసులు మూసివేశారు. ఘటనా స్థలానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, అదనపు పోలీసు కమిషనర్ జితేందర్, డీసీపీ వెంకటేశ్వర రావులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.    

 గ్యాస్ కట్టరే కారణం: ఓ షెడ్‌లో గ్యాస్ కట్టర్‌తో ఇనుప రేకును కట్ చేస్తుండగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ మంటలతో పక్కనున్న మరో 4 సిలిండర్లు పేలి క్షణాల్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. కాగా, ఈ షెడ్ల నిర్వాహకులు ప్రమాదానికి కారణాలను నిగ్గుతేల్చాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు