అలుపెరగని బాటసారి..!

28 May, 2020 09:37 IST|Sakshi
గోపాల్‌బాబా ఆశ్రమానికి కాలినడకన వెళుతున్న రామకృష్ణ

పదేళ్లుగా ప్రతి రోజు అలుపెరగని పాదయాత్ర

పిఠాపురం: కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు.. ఒకరిపై ఆధార పడకూడదనుకున్న వారు తమ కాళ్లపై తాము నిలబడి బతికున్నంత కాలం తనకు వచ్చిన రీతిలో పొట్ట నింపుకుంటారు. ఆ కోవకే చెందిన వాడే కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన పెంకే రామకృష్ణ (70). ఆయన కుటుంబం పూర్వం చాలా ఉన్నత కుటుంబమైనా కాలగర్భంలో ఆస్తులన్ని కరిగిపోగా కన్నవారు ఉన్న వారు దూరమవ్వడంతో రామకృష్ణ ఒంటరిగా మిగిలి పోయాడు. తోబుట్టువులున్నా ఎవరి దారి వారు చూసుకోగా అవివాహితుడిగా ఉండిపోయిన రామకృష్ణ కాయకష్టం చేసుకుని జీవించేవాడు. స్థానికంగా ఖాళీగా ఉండే అరుగులే ఆయన నివాస స్థావరాలు. కాగా చిన్న చిన్న పనులు చేస్తు వచ్చిన దానితో పొట్ట నింపుకునే ఆయనకు అన్నదాతగా పిఠాపురంలోని గోపాల్‌బాబా ఆశ్రమం ఆసరాగా నిలిచింది.

సుమారు పదేళ్ల క్రితం ఇక్కడ ఆశ్రమం స్థాపించిన నాటి నుంచి ఇక్కడ జరిగే ఉచిత అన్నదానంకు రామకృష్ణ వెళ్లడం ప్రారంభించాడు. ఉప్పాడ నుంచి పన్నెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురంలో గోపాల్‌బాబా ఆశ్రమానికి ఆయన ప్రతిరోజు నడిచి వెళ్లి భోజనం చేసి తిరిగి నడిచి ఉప్పాడ చేరుకుంటుండడం నిత్యకృత్యంగా మారింది. ఉదయం ఆరు గంటలకు ఉప్పాడలో టీ తాగి చిన్న చేతి కర్ర సాయంతో కాలి నడకన బయలు దేరే మధ్యాహా్ననికి పిఠాపురం చేరుకుని ఆశ్రమంలో భోజనం చేసి మళ్లీ కాలి నడకన సాయంత్రానికి ఉప్పాడ చేరుకుని ఒక అరుగుపై రాత్రి బస చేస్తుంటాడు. రోజూ అంత దూరం నడిచే బదులు ఆశ్రమంలోనే తలదాచుకోవచ్చు కదా అని ఎవరైనా అడిగితే సాయంత్రానికి తన పుట్టిన ఊరు చేరుకోపోతే తనకు నిద్ర పట్టదంటూ చెప్పడం విశేషం. ఎంత ఎండ కాసినా వర్షం వచ్చినా అతని కాలినడక మాత్రం ఆగదు. ఇదో రకం జీవన పోరాటం.

మరిన్ని వార్తలు