మహిళల భద్రతకు ముందడుగు

6 Dec, 2019 12:10 IST|Sakshi

రాత్రివేళల్లో డ్రాపింగ్‌కు అభయ్‌ వాహనాలు

ప్రతి స్టేషన్‌లో మహిళామిత్రల ఏర్పాటు

చిత్తూరు ఎస్పీ వినూత్న నిర్ణయాలు

చిత్తూరు అర్బన్‌ : మహిళల భద్రత కోసం చిత్తూరు పోలీసులు వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో చోటుచేసుకున్న దిశ హత్యాచారం దేశ వ్యాప్తంగా చర్చలకు, నిరసనలను దారితీసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలో అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు.. మహిళల భద్రత కోసం గురువారం నుంచే పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ వివరాలను ఎస్పీ సెంథిల్‌కుమార్‌ వివరించారు. ఆయన మాటల్లోనే..

అభయ్‌ వాహనాలు..
జిల్లా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నిలయం కావడంతో జాతీయ రహదారులపై నిత్యం వాహనాల రాకపోకలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారిలో మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. ఇక ఉన్నత విద్యను అభ్యసించే యువతులు కూడా ఉన్నారు. మహిళలు ఒంటరిగా వెళ్లాల్సినప్పుడు నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నా, రాత్రివేళ, రవాణా సౌకర్యం లేకున్నా, వాహనాలకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా వెంటనే డయల్‌–100కు ఫోన్‌ చేయాలి. సహాయార్థులను గమ్యస్థానానికి చేర్చడానికి అభయ్‌ వాహనాలను ఏర్పాటు చేశాం. ఫోన్‌ చేసిన కొద్దిసేపట్లోనే పోలీసు  వాహనాలు వచ్చి వారి వెళ్లాల్సిన చోటుకు చేరుస్తారు. ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం.

మహిళా మిత్ర ఏర్పాటు..
మహిళలు, బాలికల సంరక్షణ కోసం మహిళామిత్ర పేరిట కొత్త కార్యక్రమాన్ని రూపొందించాం. రెండు మూడు రోజుల్లో దీన్ని ప్రారంభిస్తున్నాం. చిత్తూరు కేంద్రంగా పనిచేస్తున్న ఉమెన్‌–జువైనల్‌ వింగ్‌ను జిల్లా మొత్తం విస్తరిస్తాం. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మహిళామిత్ర ఉంటారు. సర్కిల్‌ పరిధిలో కనీసం ఎనిమిది మంది పోలీసులతో ప్రత్యేక బృందాలను నియమిస్తున్నాం. ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ బృందాలు మహిళలకు అండగా నిలవడంతో పాటు కళాశాలలు, విద్యాసంస్థలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సంచరిస్తూ మహిళల భద్రతను పర్యవేక్షిస్తాయి.

వీడియోల ప్రదర్శన..
పిల్లలకు మంచి ఏదో, చెడు ఏదో తెలియాల్సిన సమయం ఇది. ఎదుటి వ్యక్తి పైన చెయ్యి వేస్తే ఏ ఉద్దేశంతో వేస్తున్నాడో పిల్లలు పసిగట్టాలి. ఇందుకోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో గుడ్, బ్యాడ్‌ టచ్‌ పేరిట వీడియోలు రూపొందించాం. వీటిని పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శించనున్నాం. ఇబ్బందికర పరిస్థితుల్లో ఏం చేయాలి..? చాకచక్యంగా తప్పించుకోవడం ఎలా..? పోలీసులకు ఎలా సమాచారం ఇవ్వాలి..? అనే దానిపై జిల్లా వ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మరిన్ని వార్తలు