స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీడీపీ తుడిచి పెట్టుకుని పోతుంది

11 Dec, 2019 17:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీడీపీ తుడిచి పెట్టుకుని పోతుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఆ పార్టీ ఎమ్మెల్యేలకే విశ్వాసం లేదని దుయ్యబట్టారు.  

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం 2వేల క్యూసెక్ నీటి సామర్థ్యం ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టును 6వేల క్యూసెక్కుల పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అవుకు రిజర్వాయర్‌కు లైనింగ్‌ చేయని కారణంగా.. నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేయలేక పోతున్నామని ఎమ్మెల్యే తోపుదుర్తి అభిప్రాయపడ్డారు. తెలుగుగంగ కాలువకు ఇప్పటికే సీఎం జగన్‌ టెండర్లను ఆహ్వానించారని అన్నారు.

అలానే గండికోట పునరావాసం ప్యాకేజీని కూడా సీఎం సిద్ధం చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ పూర్తిస్థాయిలో రాయలసీమ సాగునీటి  ప్రాజెక్టులకు న్యాయం చేసేందుకు  సిద్ధంగా ఉన్నారని.. గత ప్రభుత్వం అందుకు భిన్నంగా రాయలసీమ ప్రాజెక్టులపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. సాగునీటి(ఇరిగేషన్) ప్రాజెక్టులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ నివేదికతో టీడీపీ బాగోతాలు బయట పడతాయని అభిప్రాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు