సీఎం రేసులో బాబా బాలక్‌నాథ్‌?.. అధిష్టానం నుంచి పిలుపు! | Sakshi
Sakshi News home page

Rajasthan: సీఎం రేసులో బాబా బాలక్‌నాథ్‌?.. అధిష్టానం నుంచి పిలుపు!

Published Mon, Dec 4 2023 10:00 AM

Rajasthan Assembly Election Result  CM Face Mahant Baba Balaknath Called to Delhi - Sakshi

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సమిష్టి నాయకత్వంలో పార్టీ  పనిచేసింది. సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండానే బీజేపీ.. కాంగ్రెస్‌ను ఓడించి అఖండ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ గెలుపు త‌ర్వాత రాష్ట్రానికి సీఎం ఎవరనేదానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇదే సమయంలో రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ నేత, బాబా బాలక్‌నాథ్‌ను బీజేపీ కేంద్ర నాయకత్వం ఢిల్లీకి పిలిపించింది.

మహంత్ బాలక్‌నాథ్.. నాథ్ శాఖకు చెందిన ఎనిమిదవ ప్రధాన మహంత్. రాజస్థాన్‌లోని అల్వార్ స్థానానికి చెందిన లోక్‌సభ ఎంపీ కూడా. తిజారా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. అక్కడ ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయన ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ఖాన్‌పై 6173 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజస్థాన్ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపు నాటి నుంచి సీఎం అభ్యర్థిగా బాబా బాలక్‌నాథ్‌ పేరు వినిపిస్తోంది. 

రాజస్థాన్ కొత్త సీఎం రేసులో ముందంజలో ఉన్న బాబా బాలక్‌నాథ్  నేటి(సోమవారం) మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో ఆయన బీజేపీ హైకమాండ్ నేతలతో భేటీ కానున్నారు. రాజస్థాన్‌లో బాబా బాలక్‌నాథ్‌కు పార్టీ కీలక బాధ్యతలను అప్పగించవచ్చని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు.

రాజస్థాన్‌లో అధికారం కోసం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ ఉంటుందని మొదటి నుంచి అంతా భావించారు. అయితే ఫలితాలలో బీజేపీ మెజారిటీ సాధించింది. బీజేపీ 115, కాంగ్రెస్ 69, భారతీయ ఆదివాసీ పార్టీ 3, బీఎస్పీ 2, ఆర్‌ఎల్‌డీ 1, ఆర్‌ఎల్‌టీపీ 1 సీట్లు గెలుచుకున్నాయి. ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. వీరిలో చాలా మంది బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: భార్యను ఓడించిన భర్త.. అన్నను మట్టికరిపించిన చెల్లి!

Advertisement
Advertisement