మురిపించారు.. మూసేశారు

26 Nov, 2013 06:54 IST|Sakshi

జడ్చర్ల, న్యూస్‌లైన్:  బాదేపల్లి మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోళ్ల తీరు మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. కొనుగోళ్లు ప్రారంభించి ఆశించిన ధరలు కల్పిస్తామని రైతులను మురి పించిన అధికారులు, పాలకవర్గం ఆ తరువాత కొనుగోలు కేం ద్రాన్ని మూసివేసి నిరాశపరిచారు. సోమవారం మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు నిలిచిపోవడంతో స్థానిక మార్కెట్‌లో మొక్కజొన్న క్రయవి క్రయాలు స్తంభించిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోదాముల కొరత కారణంగానే కొనుగోళ్లు నిలిచిపోయాయని బాదేపల్లి సింగిల్ విండో చైర్మన్ రాంచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. గోదాముల సౌకర్యం కల్పించకపోతే సోమవారం యా ర్డులో మొక్కజొన్న కొనుగోళ్లు నిలిచిపోయే పరిస్థితి ఉందని సో మవారం ‘సాక్షి’లో ‘మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం అందని ద్రా క్ష’ అనే కథనంతో ముందే హెచ్చరించిన విషయం తెలిసిందే.
 ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి గోదాముల సౌకర్యం కల్పించడంలో నిర్లక్ష్యం వహించడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇప్పటికే దాదాపు 20వేల బస్తాల మొక్కజొన్నను కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్ గోదాముల కొరత కారణంగా వాటిని యార్డులోనే నిల్వచేశారు. బాదేపల్లి యార్డులో కొనుగోలు చేసిన ధాన్యాన్ని గద్వాలలోని గోదాములకు తరలించామని, అయితే అక్కడ గోదాములు నిండిపోవడంతో ఇతర గోదాములను తమకు కేటాయించకపోవడంతోనే ధాన్యం తరలింపు నిలిచిపోయిందని సింగిల్‌విండో చైర్మన్ తెలిపారు.

 కాగా, కొనుగోళ్లు నిలిచిపోవడం, ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో మార్కెట్ చైర్మన్ రమేశ్‌రెడ్డి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంపై దృష్టి సారించారు. సమస్యను కలెక్టర్, తదితర మార్కెటింగ్ శాఖ ఉన్నతాదికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. తక్కువ ధరలకు రైతులు అమ్ముకోవద్దంటూ మైక్‌లో ప్రకటించారు. ధాన్యాన్ని తూకం వేసి యార్డులో నిల్వచేయాలని పేర్కొన్నారు. ఇందులో పొరపాట్లు జరిగితే కమీషన్ ఏజెంట్లను బాధ్యులు చేస్తామని హెచ్చరించారు. సింగివిండో చైర్మన్ రమేశ్‌రెడ్డి, యార్డు వైస్‌చైర్మన్ మాలిక్‌షాకీర్, యార్డు సెక్రటరీ అనంతయ్య, తదితరులతో సమావేశమై చర్చించారు.
 పతనమైన ధరలు
 అయితే స్థానిక మార్కెట్‌యార్డులో వ్యాపారులు ఒక్కసారిగా మొక్కజొన్న ధరలను తగ్గించేశారు. క్వింటాలుకు దాదాపు రూ.100 నుంచి రూ.200 వరకు తగ్గించారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలోపడ్డారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తున్న తరుణంలో వ్యాపారులు మార్క్‌ఫెడ్‌తో పోటీపడుతూ ధరలను అటుఇటుగా వేసేవారు. అయితే మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు నిలిచిపోవడంతో వ్యాపారులు తమకు ఇష్టమొచ్చినట్లు ధరలు వేశారని రైతులు పెదవివిరిచారు. సోమవారం 22 వేల బస్తాల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. వ్యాపారులు క్వింటాలుకు రూ.1000 నుంచి రూ.1100లోపు వేశారు. అక్కడక్కడ కొన్ని రాసులకు గరిష్టంగా రూ.1232 వరక వేశారు.
 నేడు కొనుగోళ్లు అనుమానమే?
 మంగళవారం కూడా బాదేపల్లి మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ కొనుగోళ్లపై సందేహం నెలకొంది. ఇప్పటికే మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన 20వేల బస్తాలు యార్డులోనే ఉన్నాయి. వీటికితోడు సోమవారం మరో 22వేల బస్తాలు వచ్చాయి. మళ్లీ మంగళవారం మరో 20వేల బస్తాలు వచ్చే అవకాశం ఉండటంతో మార్కెట్ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. అంతేగాక తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పేరుకుపోయిన ధాన్యం పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు సజావుగా సాగేవిధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు