..‘అనంత’కు శరాఘాతం

1 Dec, 2013 03:34 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం : నాటి చంద్రబాబు సర్కారు పాపం.. నేటి కిరణ్ ప్రభుత్వం నిర్లక్ష్యం హంద్రీ-నీవా సుజల స్రవంతి ఆయకట్టు రైతులకు శరాఘాతంగా మారింది. కృష్ణా నదీ జలాల వివాదంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ శుక్రవారం ఇచ్చిన తుది తీర్పు హంద్రీ-నీవా ఆయకట్టు రైతుల ఆశలను అడియాసలు చేసింది. కర్ణాటక సర్కారు చేపట్టిన ఆలమట్టి రిజర్వాయర్ నిర్మాణాన్ని అప్పటి చంద్రబాబు సర్కారు అడ్డుకోలేకపోయింది. మన రాష్ట్రంలో కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టడంలోనూ చంద్రబాబు సర్కారు విఫలమైంది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో సమర్థవంతంగా వాదనలు విన్పించడంలో కిరణ్ సర్కారు విఫలమైంది.
 
 పర్యవసానంగా హంద్రీ-నీవా భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. 1973లో కృష్ణా నదీ జలాల పంపిణీపై బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఇచ్చింది. కృష్ణానదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల నికర జలాలు అందుబాటులో ఉంటాయని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి 811, కర్ణాటకకు 734, మహారాష్ట్రకు 584 టీఎంసీలు కేటాయించింది. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు మిగులు జలాలపై హక్కును కల్పించింది. బచావత్ ట్రిబ్యునల్ గడవు 2001లో పూర్తయింది. కృష్ణా జలాలను మళ్లీ పంపిణీ చేయడం కోసం జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలో ట్రిబ్యునల్‌ను కేంద్రం 2004 ఏప్రిల్ 2న ఏర్పాటు చేసింది.
 
 అప్పుడే మేల్కొని ఉంటే..:
 మిగులు జలాలపై హక్కు రావాలంటే ప్రాజెక్టులను నిర్మించాలి. ఇదే అంశాన్ని 1995 నుంచి 2004 మధ్య సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు నీటిపారుదల రంగ నిపుణులు అనేక సందర్భాల్లో సూచించారు. వాటిని అమలు చేయాల్సిన చంద్రబాబు తద్భిన్నంగా స్పందించారు. ‘కృష్ణా నదిలో నీళ్లే లేవు.. ప్రాజెక్టులు నిర్మించి ఏం చేసుకోవాలి’ అంటూ అనేక సందర్భాల్లో నీటిపారుదలరంగ నిపుణులను చంద్రబాబు అపహాస్యం చేశారు. కానీ.. ఎన్నికలకు ముందు మాత్రం ఓట్ల కోసం చంద్రబాబుకు ప్రాజెక్టులు గుర్తుకొచ్చేవి. రైతులు గుర్తుకొచ్చేవారు. కానీ.. ఆ తర్వాత వాటిని మరచిపోయేవారు. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం.. మన జిల్లాలో చేపట్టిన హంద్రీ-నీవా పనులే. 1996 మధ్యంతర లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐదు టీఎంసీల సామర్థ్యంతో కేవలం తాగునీటి కోసం హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం కోసం ఉరవకొండలో పునాదిరాయి వేశారు.
 
 కానీ.. తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఇంతలోనే 1999 సాధారణ ఎన్నికలు రానే వచ్చాయి. ఈసారి 30 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీ-నీవాకు ఆత్మకూరు వద్ద శంకుస్థాపన చేశారు. రెండు మూడు మీటర్ల మేర కాలువ తవ్వి.. ఆ తర్వాత ఆ పనులను గాలికొదిలేశారు. హంద్రీ-నీవాను చంద్రబాబు ఆనాడే పూర్తిచేసి ఉంటే.. ఈ రోజున బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఆ ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించి ఉండేదని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. ఇది దుర్భిక్ష ‘అనంత’ను సుభిక్షం చేసేదని చెబుతున్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం ఫలితంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ జిల్లా రైతులకు గొడ్డలిపెట్టు వంటి తీర్పును వెలువరించింది.
 
 కృష్ణా నదిలో 65 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,293 టీఎంసీల జలాలు లభిస్తాయని అంచనా వేసిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి 1005, కర్ణాటకకు 911, మహారాష్ట్రకు 666 టీఎంసీలు కేటాయించింది. ఆలమట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచుకునే అధికారాన్ని కర్ణాటకకు కట్టబెట్టింది. ఇది హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ఆయకట్టు రైతులకు అశనిపాతంగా మారింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 31న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పుడే కిరణ్ సర్కారు మేల్కొని ఉంటే.. ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదనే అభిప్రాయం నిపుణుల్లో బలంగా వ్యక్తమవుతోంది.
 
 ఇప్పుడెలా..?
 దుర్భిక్ష రాయలసీమ జిల్లాలను సుభిక్షం చేయాలన్న లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. రూ.6,8850 కోట్లతో అంచనా వ్యయంతో శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఇందులో మన జిల్లా పరిధిలోనే 3.45 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా పథకాన్ని రూపొందించారు. హంద్రీ-నీవాకు కేటాయించిన 40 టీఎంసీలను శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద వచ్చే 120 రోజుల్లో రోజుకు మూడున్నర వేల క్యూసెక్కులకు తగ్గకుండా నీటిని ఎత్తిపోసుకోవచ్చునని పేర్కొన్నారు. కృష్ణా జలాల పంపిణీ వివాదం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారిస్తోన్న నేపథ్యంలో.. హంద్రీ-నీవాకు మిగులు జలాలు కేటాయించారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాత రాష్ట్రానికి కేటాయించిన నికర జలాల మంజూరులో హంద్రీ-నీవాకు తొలి ప్రాధాన్యం ఇస్తామని అప్పట్లో వైఎస్ హామీ ఇచ్చారు. హంద్రీ-నీవా పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు వైఎస్ భారీ ఎత్తున నిధులు కేటాయించారు.
 
 ఇప్పటికే ఈ ప్రాజెక్టు పనులపై రూ.4,700 కోట్లకుపైగా ఖర్చు చేశారు. గతేడాది నవంబర్ 18న శ్రీశైలం నుంచి హంద్రీ-నీవా కాలువల్లోకి ట్రయల్ రన్ ద్వారా నీటిని ఎత్తిపోశారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 4.5 టీఎంసీలను హంద్రీ-నీవా కాలువల్లోకి ఎత్తిపోస్తే.. మన జిల్లా పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు 1.5 టీఎంసీలు చేరాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను కూడా మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసిన నేపథ్యంలో.. మన రాష్ట్రానికి అదనంగా కేటాయించిన 200 టీఎంసీల నికర జలాల్లో హంద్రీ-నీవా వాటా ఎంత అన్నది తేల్చాల్సి ఉంది.
 
 ఇకపోతే ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచితే.. ఆ డ్యామ్ నిండి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండిన తర్వాతనే శ్రీశైలం రిజర్వాయర్‌లోకి కృష్ణా జలాలు వస్తాయి. ప్రస్తుతం ఆగస్టు మొదటి వారం నాటికే శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 854 అడుగులకు చేరుతోంది. కానీ.. ఆలమట్టి ఎత్తు పెంచితే.. సెప్టెంబరు మొదటి వారానికి గానీ శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగులకు నీళ్లు చేరవు. 854 అడుగులకు నీళ్లు చేరితేగానీ హంద్రీ-నీవా కాలువల్లోకి నీటిని ఎత్తిపోయలేని దుస్థితి నెలకొంటుంది. దీన్ని బట్టి చూస్తే హంద్రీ-నీవా ఆయకట్టు రైతులకు కష్టాలు తప్పవన్నది విశదమవుతోంది.
 

>
మరిన్ని వార్తలు