పర్యవేక్షణ కొనసాగాలి

8 Apr, 2020 03:44 IST|Sakshi

కోవిడ్‌–19 వ్యాప్తి నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

1.37 కోట్ల కుటుంబాల సర్వే పూర్తి 

5,517 మందికి దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తింపు..

వారి ఇళ్ల వద్దే కొనసాగుతున్న వైద్యం

అనుమానితులపై నిరంతర పర్యవేక్షణ.. అవసరమైతే వారికి కరోనా పరీక్షలు

కోవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్, క్యాంపుల్లో వసతులు మెరుగు పరచాలి 

విదేశాలు, ఢిల్లీ నుంచి వచ్చిన వారు,వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ అందరికీ దాదాపు పరీక్షలు పూర్తి 

క్వారంటైన్‌ పూర్తయిన వారు కొద్ది రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండేలా చూడాలి 

ఇదే రీతిలో చర్యలు కొనసాగిస్తే త్వరలో వైరస్‌ కట్టడికి అవకాశం

కుటుంబ సర్వే ద్వారా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్న వారిని గుర్తించారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు.

విదేశాల నుంచి వచ్చిన వారిలో 19,247 మంది ఇంకా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రత్యేక యాప్‌ ద్వారా వీరిపై నిరంతర పర్యవేక్షణ ఉంటోంది. ఐసోలేషన్‌ ముగిసిన వారికి ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్‌ కొనసాగించాలి. వీరుకాక లక్ష మంది వరకు హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు వీరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  

క్రిటికల్‌ కేర్‌ కోసం నిర్దేశించిన కోవిడ్‌ ఆసుపత్రులు, జిల్లాల వారీగా నిర్దేశించుకున్న కోవిడ్‌ ఆస్పత్రుల సన్నద్ధతపై కూడా మరింతగా దృష్టి పెట్టాలి. స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) మేరకు వసతుల్లో నాణ్యత ఉండేలా చూడాలి. వారంలో అనుకున్న మేరకు వసతులు సమకూరాలి. క్వారంటైన్లు, క్యాంపుల్లో కూడా ఇదే రీతిన సదుపాయాలు కల్పించాలి.   
– సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.46 కోట్ల కుటుంబాలకు గాను 1.37 కోట్ల కుటుంబాలను సర్వే చేసి.. జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి లక్షణాలతో ఉన్నట్లు గుర్తించిన 5,517 మందికి ఇళ్ల వద్దే అందిస్తున్న చికిత్సను కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వారిలో ఏమాత్రం కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించినా వెంటనే మళ్లీ వైద్య పరీక్షలు జరిపించాలని చెప్పారు. వారందరిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. వైజాగ్‌లో, రాష్ట్రంలో హాట్‌ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలపై మరింతగా దృష్టి సారించాలని చెప్పారు. క్వారంటైన్లు, క్యాంపుల్లో మరిన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. కోవిడ్‌–19 వ్యాప్తి నివారణ చర్యలు, ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో వెల్లడైన ఫలితాలు సరళి, లాక్‌ డౌన్‌ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, కనీస ధరల కల్పనపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమీక్షలో చర్చకు వచ్చిన అంశాలు, సీఎం సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి. 
క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

రైతులెవ్వరికీ ఇబ్బంది రాకూడదు 
► వరి, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనందున ఎక్కడా రైతులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా చర్యలు తీసుకోవాలి. ప్రతి రోజూ కనీసం 150 ట్రక్కుల వరకూ అరటి ఎగుమతి. మరోవైపు మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోలు చేసి స్థానిక మార్కెట్లకు సరఫరా. టమాటా దిగుమతులు తగ్గుతున్నందున పంట విక్రయ సమస్యలు సమసినట్లే. బొప్పాయి, మామిడి పంట కొనుగోలుపై దృష్టి. కర్నూలు వెలుపల ఉల్లి మార్కెట్‌ ఏర్పాటు చేయాలి. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి.  
► క్రమంగా పెరుగుతున్న ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు. కనీసం రోజుకు 40 కంటైనర్ల వరకు ఎగుమతి. పని చేస్తున్న ప్రాసెసింగ్‌ యూనిట్లు, కోల్డు స్టోరేజీ ప్లాంట్లు.    
► ఈ సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

క్రమంగా కేసులు తగ్గే అవకాశం
► సోమవారం సాయంత్రం 6 నుంచి మంగళవారం ఉదయం వరకు 150 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒక పాజిటివ్‌ కేసు వచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చిన వారికి, వారితో సన్నిహితంగా ఉన్న వారికి, కుటుంబీకులకు దాదాపు పరీక్షలు పూర్తయ్యాయి.
► ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 997 మందికి పరీక్షలు నిర్వహించగా, 196 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరితో కాంటాక్ట్‌ అయిన వారు, కలిసి ప్రయాణించిన వారు, కనీసం 3–4 గంటలు వారితో ఉన్న 2,400 మందికి పరీక్షలు నిర్వహించగా 84 మందికి పాజిటివ్‌ వచ్చింది. మొత్తంగా 280 మందికి పాజిటివ్‌.    
► విదేశాల నుంచి వచ్చిన 205 మందికి పరీక్షలు నిర్వహించగా, 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరితో కాంటాక్ట్‌ అయిన 120 మందికి పరీక్షలు నిర్వహించగా, ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. కరోనా లక్షణాలు కనిపించిన 134 మందికి పరీక్షలు చేస్తే ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా