బెయిల్‌పై వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు విడుదల

23 Nov, 2014 03:44 IST|Sakshi

మరో 10 మంది కార్యకర్తలు కూడా..

నంద్యాల:  వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఇద్దరు శనివారం బెయిల్‌పై విడుదలయ్యారు. గత నెల 31వ తేదీన నంద్యాల పురపాలక సంఘ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించగా.. ఆక్రమణలను తొలగించడానికి, రహదారులను నిర్మించడంపై చర్చించాలని ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు.  దీనిని జీర్ణించుకోలేక టీడీపీ కౌన్సిలర్లు చైర్‌పర్సన్ దేశం సులోచన ఆధ్వర్యంలో దాడికి దిగారు.

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించలేదు. టీడీపీకి చెందిన చైర్‌పర్సన్ దేశం సులోచన, వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్‌లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెలేయ భూమాతో పాటు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, వారి అనుచరులపై కేసును నమోదు చేశారు. నవంబర్ 1వ తేదీ తర్వాత వారిని అరెస్ట్ చేశారు. అయితే వారు కోర్టును ఆశ్రయించగా శుక్రవారం స్థానిక మూడో అదనపు కోర్టులో జడ్జి రామలింగారెడ్డి బెయిల్ మంజూరు చేశారు.

దీంతో కౌన్సిలర్లు మన్నెం కృపాకర్, దిలీప్‌కుమార్‌తోపాటు మరో 10మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను జైలు అధికారులు విడుదల చేశారు. ఆళ్లగడ్డ సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న మన్నెం కృపాకర్, దాసరి జగన్, చిందుకూరు మనోహర్, లింగమయ్య, చాకలి శ్రీనివాసులు, ప్రసాదరెడ్డి, అశోక్, కాటపోగు ప్రసాద్‌లను నంద్యాల సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న దిలీప్‌కుమార్‌తో పాటు చంటి, వడ్డె మనోజ్, పెయింట్ మధుబాబులను విడుదల చేశారు. వీరి విడుదల సమాచారం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఆళ్లగడ్డ, నంద్యాల జైలు దగ్గరకు వెళ్లి ఆప్యాయతతో స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు