వాహనాల వేగానికి కళ్లెం

12 Jun, 2019 13:13 IST|Sakshi

సాక్షి, గుంటూరు :  అతివేగం వలన జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లా రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. స్పీడ్‌ గన్‌తో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులపై నిర్దేశించిన వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలను స్పీడ్‌గన్‌తో గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాకు ఒక స్పీడ్‌ గన్‌ను ప్రభుత్వం 2018లో అందించింది.

ప్రతి రోజు ఒక మోటల్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌కు స్పీడ్‌ గన్‌తో జిల్లాలోని వివిధ రహదారుల్లో తనిఖీలు నిర్వహించే బాధ్యతను అప్పగించారు. స్పీడ్‌ గన్‌లో సంబంధిత రహదారిపై నిర్దేశించిన వేగాన్ని ముందుగానే సెట్టింగ్‌ చేస్తారు. రహదారిపై వాహనాలను స్పీడ్‌ గన్‌తో పరిశీలిస్తారు. నిర్దేశించిన వేగం కంటే అధిక వేగంతో ప్రయాణించే వాహనం ఫొటో తీసుకుంటారు. వాహనం నంబరు ఆధారంగా యజమానికి రూ.1500 అపరాధ రుసుం విధిస్తారు.

అపరాధ రుసుం విధించిన వాహనాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయటం వలన వాహనంపై జరిగే ఇతర లావాదేవీలు అపరాధ రుసుం చెల్లిస్తేనే సాధ్యం అవుతాయి. అపరాధ రుసుం వివరాలను రిజిస్ట్రేషన్‌ సమయంలో అందించిన ఫోన్‌ నంబరుకు సంక్షిప్త సమాచార రూపంలో అందిస్తారు. జిల్లాలో  అతివేగంగా ప్రయాణించే వాహనాలపై 2018 సంవత్సరంలో 1,559 కేసులు నమోదు చేసి, రూ.21.82 లక్షల అపరాధ రుసుం విధించారు. 2019 జూన్‌ 9వ తేదీ వరకు 1,881 కేసులు నమోదు చేశారు. రూ.26.33 లక్షల జరిమానా వేశారు.

అధిక వేగంతో అనర్థాలు
వాహన ప్రమాదంలో ప్రాణ నష్టానికి వేగం ప్రధాన కారణం. వాహనాలు గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు రహదారిపై ప్రమాదం జరిగిన వాహనంలో ప్రయాణిస్తున్న వారికి జరిగే గాయాల శాతం తీవ్రత తక్కువుగా ఉంటుంది. వీటి మరణాలు శాతం కూడా 10శాతానికి మించి ఉండదు. కాని వాహన వేగం 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వరకు ఉంటే మాత్రం గాయాల శాతం తీవ్రత ఎక్కువుగా ఉండటంతో పాటు మరణాలు 90శాతం ఉంటుంది.

ఇక 100 కిలోమీటర్లకు మించి వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమదాలు జరిగితే మాత్రం వాహనంలో రక్షణ పరికరాలైన ఎయిర్‌బెలున్సు ఉన్న అవి ఫెయిల్‌ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రహదారుల పరిస్థితి  కూడా వాహనాలు వేగంపై ప్రభావం చూపుతుంది. జిల్లాలోని అంతర్గత సింగిల్, డబుల్‌ రోడ్లు, స్థానిక పరిస్థితుల బట్టీ కూడా వాహన వేగం నియంత్రించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన వాహనాల్లో స్పీడ్‌ గంటకు 150 కిలోమీటర్ల పైనే ప్రయాణించే వీలు ఉంటుంది. స్థానికంగా ఉండే రహదారుల నిర్మాణం, పరిసరాల పరిస్థితుల ఆధారంగా అతి వేగంతో ప్రయాణించే వాహనం నియంత్రణ కోల్పోతుంది. వాహనాలు పక్కకు వెళితే చెట్లకు గుద్దుకోవటం, పక్కన ఉన్న కాల్వలోకి దూసుకుపోయి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.జాతీయ రహదారులకు 100 కిలోమీటర్లు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలకు 120 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది.

అన్ని రహదారులపై జనసమ్మర్థంగా ఉండే ప్రాంతాలు, మూలమలుపుల వద్ద, నారో బ్రిడ్జ్‌ల వద్ద, రోడ్డు క్రాసింగ్‌లు, సర్వీసు రోడ్డులకు వెళ్లే ప్రాంతాల్లో మాత్రం 10 కిలోమీటర్లు నుంచి 5 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాల్సి ఉంది. వేగం నిర్దేశించిన రహదారుల్లో లైట్‌ మోటర్‌ వెహికల్‌(నాన్‌ ట్రాన్స్‌పోర్టు) నో లిమిట్, లైట్‌ మోటర్‌ వెహికల్‌ (ట్రాన్స్‌పోర్టు) 65 కిలోమీటర్లు, మోటర్‌ సైకిల్‌ 50 కిలోమీటర్లు, ప్యాసింజర్‌/ గూడ్స్‌ వెహికల్‌ 65 కిలోమీటర్లు, మీడియం/హెవీ వెహికల్స్‌ 65 కిలోమీటర్లు, ట్రైలర్‌ 50 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించాలని నిబంధన ఉంది. 

మరిన్ని వార్తలు