అధిష్టానుసారమే!

25 Jul, 2013 03:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన మేరకు పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం త్వరలోనే ఉంటుందని చెబుతున్న నేపథ్యంలోనే సీమాంధ్ర మంత్రులు ప్రత్యేకంగా భేటీ అవడం ‘గేమ్‌ప్లాన్’లో భాగమేనా? అంతా అధిష్టానం ఆలోచన మేరకే నడుస్తోందా? కాంగ్రెస్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ పూర్తిగా పెద్దల కనుసన్నల్లోనే సాగుతున్నాయని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఒకసారి తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టు సంకేతాలివ్వడం, మరోసారి ఎలాంటి నిర్ణయానికీ రాలేదని ప్రకటనలు చేయడం వంటివి కాంగ్రెస్‌కు ఇటీవలి కాలంలో పరిపాటిగా మారాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా దిగ్విజయ్‌సింగ్‌ను నియమించాక ఆయన రాష్ట్రంలో తొలిసారిగా పర్యటిస్తూనే ముగ్గురు ముఖ్య నేతలను రోడ్‌మ్యాప్‌లు కోరడం, తర్వాత కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమవడం తెలిసిందే. దిగ్విజయ్ రాకకు సరిగ్గా ఒక్కరోజు ముందే అధిష్టానం ఆదేశంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశంలోనే ఏదో నిర్ణయానికి వస్తుందని కూడా జోరుగా ప్రచారం కల్పించారు.

చివరికి అందులో ఎటూ తేల్చకుండా, సీడబ్ల్యూసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అది త్వరలో జరగబోతోందని వినిపిస్తున్న నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా మంత్రులు ‘అవసరమైతే రాజీనామా చేస్తాం’ అని ప్రకటించడం, ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించడం విశేషం. ఈ పరిణామాలన్నీ పరిస్థితులను మరింత గందరగోళంలో పడేయాలన్న అధిష్టానం వ్యూహంలో భాగంగానే జరుగుతున్నాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సీమాంధ్ర నేతలను పార్టీ పెద్దలే ఇందుకు పురిగొల్పినట్టుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. గతంలో సీమాంధ్ర నేతలు సమావేశాలు పెట్టినా పూర్తిస్థాయిలో హాజరు ఉండేదే కాదు. అలాంటిది బుధవారం నాటి సమావేశానికి ఒకరిద్దరు తప్ప మంత్రులంతా హాజరవడం విశేషం.

పైగా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలతోనూ రాజీనామాలు చేయించేలా ఒత్తిడి పెంచుతామని కూడా వారన్నారు. ఈ వ్యవహారం మొత్తం అధిష్టానం కనుసన్నల్లోనే కొనసాగుతోందనేందుకు ఇదే రుజువంటున్నారు. సీమాంధ్ర నేతలను కూడా ఉద్యమానికి, రాజీనామాలకు, ఆందోళనలకు పురికొల్పి సమస్యను మరింత జటిలం చేయాలన్న ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చివరకు ఈ అంశాన్ని ఎన్నికల ఎత్తుగడగా ఉపయోగించుకోవాలని కూడా అధిష్టానం యోచిస్తున్నట్టు పార్టీలో వినిపిస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర మంత్రుల భేటీకి ముందే ఏపీ ఎన్జీవోలు వంద రోజుల కార్యాచరణతో ఉద్యమానికి పిలుపునివ్వడం తెలిసిందే. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల ముట్టడితో పాటు పలు కార్యక్రమాలను వారు నిర్ణయించారు. సమైక్య ఉద్యమంలో కలిసొస్తే ఎన్నికల్లో గెలిపిస్తామని, లేదంటే సీమాంధ్రలో గెలవనివ్వబోమని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఆ వెంటనే సీమాంధ్ర మంత్రులు, నేతలు భేటీ కావడం, అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేయడం వ్యూహాత్మకమేనని గట్టిగా వినిపిస్తోంది.
 

మరిన్ని వార్తలు