వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా ద్రోణంరాజు

14 Jul, 2019 08:22 IST|Sakshi
వీఎంఆర్డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నమంత్రి బొత్స సత్యనారాయణ, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌  

విశ్వసనీయత, విధేయతకు పట్టం


విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సౌమ్యుడు, నిజాయితీ పరుడైన ద్రోణంరాజుకు పదవి ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది

సాక్షి, విశాఖసిటీ: ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా తనను నియమించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ అన్నారు. రాజకీయంగా తనకు ఇది పునర్జన్మ అని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. వీఎంఆర్డీఏ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ద్రోణంరాజు శనివారం సాక్షితో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా, తనను గుర్తుంచుకుని ఇంతటి ప్రతిష్టాత్మక పదవి ఇవ్వడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గొప్పతనానికి, ఔనత్యానికి నిదర్శనమన్నారు. తన వెంట 150 మంది ఎమ్మెల్యేలు ఉండగా తనను గుర్తించి ఈ పదవి ఇవ్వడంతో రాజకీయాల్లో విశ్వసనీయత అంశంలో సీఎం జగన్‌ మరోమెట్టు ఎక్కారని కొనియాడారు. సీఎం ఎంతో నమ్మకంతో తనకిచ్చిన ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. 

అందరినీ కలుపుకొని ముందుకు..
గత ప్రభుత్వ హయాంలో వీఎంఆర్‌డీఏ ద్వారా జరిగిన ల్యాండ్‌పూలింగ్‌ వ్యవహారంపై పలు ఆరోపణలు వచ్చాయని, ఈ వ్యవహారంలో సీఎం నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేశారు. నగరాభివృద్ధి, పర్యాటకాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులను కలుపుకొని ముందుకు సాగుతామని వెల్లడించారు. నగరాభివృద్ధి కోసం పని చేసే ప్రజాసంఘాల సూచనలను తప్పక తీసుకుంటామన్నారు. అందరికీ ఇళ్లు అందేలా.. నవరత్నాల పథకాలను ఆధారంగా చేసుకుని పాలన సాగిస్తామని చెప్పారు. తన తండ్రి దివంగత ద్రోణంరాజు సత్యనారా యణ వుడాకు తొలి చైర్మన్‌గా పనిచేయడం.. తాను వీఎంఆర్‌డీఎకు తొలి చైర్మన్‌గా నియామకం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 

నాడు తండ్రి.. నేడు తనయుడు
ద్రోణంరాజు శ్రీనివాస్‌ తండ్రి, దివంగత ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ 1979లో విశాఖ కేంద్రంగా ఏర్పడిన విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) వ్యవస్థాపక చైర్మన్‌గా వ్యవహరించారు. సరిగ్గా 40 ఏళ్ల తరువాత వుడా పరిధి పెంచుకుని విశాఖతో పాటు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల వరకు విస్తరించిన వీఎంఆర్‌డీఏకు తొలి చైర్మన్‌గా శ్రీనివాస్‌ నియమితులయ్యారు. వీఎంఆర్‌డీఏగా రూపాంతరం చెందిన తరువాత టీడీపీ ప్రభుత్వం సంస్థను గాలికొదిలేసింది. కేవలం తమ అనుయాయుల కోసం ల్యాండ్‌పూలింగ్‌ చేపట్టి వీఎంఆర్‌డీఏను పావుగా వాడుకుంది తప్ప సంస్థాగతంగా దృష్టి సారించలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రాగానే సంస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. నగరానికి అత్యంత కీలకమైన ఈ సంస్థకు ద్రోణంరాజును చైర్మన్‌గా నియమించడం ద్వారా ప్రజలకు సానుకూల సంకేతాలు ఇచ్చింది. గతంలో విశాఖ–1 ఎమ్మెల్యేగా, ప్రభు త్వ విప్‌గా పని చేయడంతో ఆయనకు నగరంపై పూర్తి అవగాహన ఉంది. నగర అభివృద్ధితో పాటు వీఎంఆర్‌డీఏ వైభ వం కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారన్న నమ్మకంతో ఆయన్ని ఈ పదవిలో ముఖ్యమంత్రి నియమించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  

శుభాకాంక్షల ఝరి
వీఎంఆర్డీఏ చైర్మన్‌గా నియమితులైన ద్రోణంరాజు శ్రీనివాస్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, కె.కె.రాజు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, బెహరా భాస్కర్, రవిరెడ్డి తదితర నాయకులు అభినందించారు. 

మరిన్ని వార్తలు