పత్రం.. పుష్పం.. ‘కలం’.. తోయం

20 Feb, 2014 01:39 IST|Sakshi

 అయినవిల్లి, న్యూస్‌లైన్ : ‘పత్రం, పుష్పం, ఫలం, తోయం..’ ఇదీ సాధారణంగా దైవాన్ని అర్చించే క్రమం. అయితే.. అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రంలో బుధవారం ఈ క్రమంలో ‘కలం’ చేరింది. గత ఆరేళ్లుగా ఏటా పరీక్షలకు ముందు చేస్తున్న మాదిరే ఈ ఏడాది కూడా స్వామిని పెన్నులతో  అభిషేకించారు. తొలుత  ఆలయ ప్రధానార్చకులు మాచరి సూరిబాబు వివిధ ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో స్వామిని అభిషేకించారు. పండితులు ‘చదువుల పండుగ’ పేరుతో  సరస్వతీ యాగం నిర్వహించి, లక్ష గరిక పూజ చేశారు. అనంతరం స్వామిని రెండు లక్షల పెన్నులతో అభిషేకించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు స్వామిని దర్శించుకుని పరీక్షల్లో విజయం వరించాలని వేడుకున్నారు. ‘చదువుల పండుగ, పెన్నుల అభిషేకం’ సందర్భంగా గర్భాలయంలో గరిక గడ్డితో సిద్ధివినాయకుని ఆకృతిని తీర్చిదిద్దారు. అర్చకులు మాచరి వినాయకరావు రెండు గంటల పాటు శ్రమించి ఈ గరిక గణపతిని రూపుదిద్దారు. స్వామికి కలువ రేకులతో నామాలు, పుష్పాలతో నేత్రాలు, నుదుట బొట్టు, దంతాలు అమర్చిన స్వామి ఆకృతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.  
 
 నేడు విద్యార్థులకు పంపిణీ
 స్వామివారిని అభిషేకించిన పెన్నులను గురువారం  విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. పంపిణీని ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి ప్రారంభిస్తారన్నారు. పంపిణీ సక్రమంగా జరిగేందుకు ఆలయం వద్ద  బారికేడ్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, ఉచిత వైద్య శిబిరం వంటి సదుపాయాలకు ఏర్పాట్లు చేశారు విద్యార్థులకు ఎండదెబ్బ తగలకుండా చలువ పందిళ్లు నిర్మించారు. పెన్ను తీసుకున్న ప్రతి విద్యార్థీ అన్నదాన సత్రంలో స్వామివారి ప్రసాదం స్వీకరించాలని ఈఓ కోరారు.
 
 

మరిన్ని వార్తలు