వచ్చేశాయి విద్యుత్‌ కార్లు

3 Dec, 2018 11:28 IST|Sakshi
ఈపీడీసీఎల్‌లో విద్యుత్‌ కారు ప్రారంభించిన సీఎండీ హెచ్‌.వై.దొర

ఈపీడీసీఎల్‌లో ప్రారంభించిన సీఎండీ దొర

ఇంధన వనరుల ఆదా,పర్యావరణ పరిరక్షణ

కిలోమీటర్‌కు రూపాయి ఖర్చు

18 యూనిట్ల విద్యుత్‌తో 120 కి.మీ.

సాక్షి,విశాఖపట్నం: పర్యావరణ పరిరక్షణ వాహనాలైన విద్యుత్‌ కార్లు విశాఖ వచ్చేశాయి. వీటిని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ హెచ్‌.వై. దొర గురుద్వార్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా టెస్ట్‌ రైడ్‌ చేసి వాహన సామర్ధ్యాన్ని పరీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నూరుశాతం పర్యావరణాన్ని రక్షించే విధంగా, ఇంధన వనరుల అవసరం లేకుండా నడిచే ఈ వాహనాలకు కిలోమీటర్‌కు కేవలం ఒక్క రూపాయి ఖర్చు అవుతుందన్నారు. సంస్థ ఉపయోగార్థం 15 వాహనాలను తీసుకున్నామని చెప్పారు. ఈఈఎస్‌ఎల్‌(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌) సంస్థ నెలవారీ అద్దె ప్రాతిపదికన సమకూరుస్తుందన్నారు. 30 కిలోవాట్ల మోటారు కలిగిన ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉందని వెల్లడించారు. ఈ కార్ల నిర్వహణకు 6 ఏళ్ల పాటు లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ ఉండటం విశేషమన్నారు.

20 చార్జింగ్‌ స్టేషన్లు
ఈ కార్ల కోసం నగరవ్యాప్తంగా 20 విద్యుత్‌ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో 12 కేంద్రాలు ఇప్పటికే సిద్ధం కాగా మరో ఎనిమిదింటిని త్వరలోనే పలుచోట్ల ప్రారంభిస్తామన్నారు. ఒక కారు పూర్తిగా చార్జ్‌ చేయడానికి డీసీ చార్జింగ్‌ స్టేషన్లకు 60 నుంచి 90 నిమిషాల సమయం పడుతుందన్నారు. ఈఈయస్‌ఎల్‌ వారు 15 ఏఎంపీఎస్‌ ఏసీ చార్జింగ్‌ పాయింట్స్‌ను ఏపీఈపీడీసీఎల్, జీవీఎంసీ, కలెక్టర్‌ కార్యాలయాల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారన్నారు. యూనిట్‌ కరెంట్‌కు 6.95రూ. చొప్పున చెల్లించవలసి ఉంటుందన్నారు. ఒక కారు చార్జింగ్‌కు 18 యూనిట్ల విద్యుత్‌ ఖర్చు అవుతుందని, ఒకసారి పూర్తిగా చార్జ్‌ చేసిన కారు 120 కిలోమీటర్లు దూరం వరకు నడిపేందుకు వీలవుతుందని తెలిపారు. చార్జింగ్‌ కేంద్రాలు మరమ్మతులు, నిర్వహణ బాధ్యతను ఎక్సికామ్‌ టెలిసిస్టమ్స్‌ సంస్థ దక్కించుకుందన్నారు. ఐదేళ్ల పాటు డీసీ చార్జింగ్‌ స్టేషన్లు నిర్వహణ చూసుకునేలా ఒప్పందం కుదిరిందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్‌ డైరెక్టర్లు బొడ్డు శేషుకుమార్, టీవీఎస్‌ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు రమేష్‌ ప్రసాద్, సీజీఎంలు పి.వి.వి సత్యనానరాయణ, కె.యస్‌.ఎన్‌.మూర్తి, వి.విజయలలిత, పి.నాగేశ్వరరావు, ఒ. సింహాద్రి, పి.ఎస్‌.కుమర్, జి.శరత్‌కుమార్, ఆర్‌.శ్రీనివాసరావు, వై.ఎస్‌. ఎన్‌.ప్రసాద్, జి.శ్రీనివాసరెడ్డి, జీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు