వివాదంలో ఎస్వీబీసీ: ఛానల్‌​ వద్ద ఉద్రిక్తత

5 Jan, 2018 13:33 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ వివాదంలో చిక్కుకుంది. ఎస్‌వీబీసీ ఛానల్‌ సీఈవో నరసింహారావు తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నరసింహారావు  గురువారం అర్థరాత్రి  కార్యాలయంలోని ఫైళ్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా మేకప్‌మన్‌ వెంకటేశ్వర రెడ్డి అడ్డుకున్నారు. దీంతో తనపై నరసింహారావు దాడి చేసినట్టు వెంకటేశ్వర రెడ్డి అలిపిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 

మరో వైపు వెంకటేశ్వర రెడ్డిపై దాడికి నిరసనగా శుక్రవారం ఛానెల్‌ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఎస్వీబీసీ వద్ద ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిసెంబర్‌ 30 తో పదవీ కాలం ముగిసినా ఇంకా కొనసాగుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఉద్యోగులు ఆరోపించారు. తన అవినీతికి చెందిన ఫైళ్లను తారుమారు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగిపై దాడికి పాల్పడ్డ సీఈవో నరసింహారావు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

కాగా, ఎస్వీబీసీలో అవకతవకలు జరుగుతున్నట్టు ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఛానల్‌లో చోటు చేసుకున్న పరిణామాలు శ్రీవారి భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఛానల్‌ నిర్వహణ పేరుతో టీటీడీకి చెందిన కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని బలమైన ఆధారాలు ఉన్నాయి. సీఈవో నరసింహారావు టీడీపీ పెద్దల అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్నట్టు అభియోగాలున్నాయి. ఇప్పటికైనా అవినీతిపై కొరడా ఝుళిపించి  శ్రీవారికి చెందిన ఛానల్‌ ను కాపాడాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు