13 ఏళ్ల క్రితమే ఆంగ్ల బోధన

23 Nov, 2019 12:34 IST|Sakshi
‘సక్సెస్‌’ విభాగం ఉన్న పట్టణ పరిధిలోని జిల్లా పరి«షత్‌ ఉన్నత పాఠశాల

వైఎస్‌ హయాంలోనే  ప్రారంభమైన ఆంగ్లమాద్యమం 

2006 నుంచి కొనసాగుతున్న సమాంతర ఆంగ్ల బోధన

సక్సెస్‌ స్కూళ్ల ద్వారా ప్రయోగాత్మకంగా అమలు 

రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల బోధన 13 ఏళ్లుగా ‘సక్సెస్‌’ఫుల్‌గా నడుస్తోంది. మహానేత ముందు చూపుతో ఏర్పాటు చేసిన సక్సెస్‌స్కూళ్లలో ఆనాడే ఆంగ్లబోధన మొదలైంది. అటు తరువాత కేజీబీవీలు... మోడల్‌ స్కూళ్లకూ విస్తరించింది. అదే స్ఫూర్తితో ఆరోతరగతి వరకూ పూర్తిగా ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడితే విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. అదేదో గొప్ప తప్పిదమైనట్టు గగ్గోలు పెడుతున్నాయి. కానీ నిరుపేదలకు దీనివల్ల ఎంత మంచి జరగబోతోందో... అర్థం చేసుకోవట్లేదు. రాజకీయ కోణంలో చూస్తూ లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నాయి. 

సాక్షి, విజయనగరం: ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషతోపాటు ఆంగ్లమాధ్యమాన్ని సమాంతరంగా అందించే విధానాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి 2006లోనే తీసుకొచ్చారు. తరువాత వచ్చిన పాలకులు ఆయన లక్ష్యాలను పట్టించుకోక పోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లోని ఆంగ్లమాద్యం అటకెక్కింది. అయినప్పటికీ జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల్లో మూడింట ఒక వంతు మంది ఇంగ్లిష్‌ మీడియం చదువుతున్నారు. వీటి నిర్వహణలో చిత్తశుద్ధి చూపకపోవడం వల్ల ప్రైవేటు విద్యావ్యవస్థను పరోక్షంగా బలోపేతం చేశాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వేలకు వేల రూపాయలు ఫీజులు చెల్లించి మరీ ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లకు పంపుతున్నారు.

పిల్లలను చది వించే విషయంలో తల్లిదండ్రులు అప్పులు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇంగ్లిష్‌ మీడియంలో చదివించాలనే తల్లిదండ్రుల ఆకాంక్షను ప్రైవేటు పాఠశాలలు ఆసరాగా మలచుకున్నాయి. వారి ఫీజుల దోపిడీని ప్రజా సంకల్పయాత్రలో తెలుసుకున్న వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ‘నేను విన్నాను... నేను ఉన్నాను..’ అంటూ పేదలకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలోనే బోధించేలా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇప్పుడు మేధావులు, విద్యావేత్తలు, ప్రజలు హర్హం వ్యక్తం చేస్తున్నారు. 

13 ఏళ్ల క్రితమే వైఎస్‌ హయాంలో ఆంగ్ల బోధన 
రాష్ట్రంలో ఇంగ్లిష్‌ మీడియం కోరుకుంటున్న తల్లిదండ్రులు ప్రైవేటు వైపు మొగ్గుచూపుతున్న పరిస్థితులను తొలుత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రలోనే గుర్తించారు. ఇంగ్లిష్‌ మీడియం పెట్టాలనే ముందుచూపుతో పదవిలోకి వచ్చిన తరువాత 2006లో ఆయన తొలుత సమాంతరంగా ఇంగిఎలష్‌ మీడియం ప్రవేశ పెట్టారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకోసం జిల్లాలో అప్పట్లోనే 173 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ‘సక్సెస్‌ స్కూల్‌’ పేరుతో ఇంగ్లిష్‌ మీడియం సమాంతరంగా ప్రవేశ పెట్టారు. ఇంగ్లిష్‌ బోధించేందుకు కొందరు ఉపాధ్యాయులను సక్సెస్‌ స్కూళ్లకు కేటాయించారు. అప్పట్లో వైఎస్‌ ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెట్టక పోయి ఉంటే ప్రభుత్వ బడులు చాలా వరకు కనుమరుగయ్యేవని విద్యావేత్తలు, మేధావులు అంటున్నారు. 

మహానేత వేసిన బీజం కేజీబీవీలకూ విస్తరణ 
వైఎస్‌రాజశేఖరరెడ్డి నాడు వేసిన బీజం కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలో కూడా విస్తరించి అమలులో వచ్చింది. రెండేళ్ల క్రితం అమలులోకి వచ్చిన 33 కేజీబీవీలలో ఇంతవరకు 12 వేల మంది వరకు బాలికలు పదోతరగతి పూర్తి చేసుకొని బయటకు వచ్చారు. పదేళ్లక్రితం ప్రారంభించిన 16 మోడల్‌ స్కూళ్లలో ఆంగ్ల మాద్యమంలో చదివి పదోతరగతి పూర్తి చేసుకొని బయటకు వచ్చి ఉన్నతంగా స్థిరపడిన వారు 20 వేల మంది వరకు ఉన్నారు. ఈ ఏడాది జిల్లాలో వివిధ యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాద్యం అందుకుంటున్న విద్యార్ధులు 68,869 మంది వరకు ఉన్నారు. మొత్తం  2,10,898 మంది విద్యార్థుల్లో మూడింట ఒక వంతు ఆంగ్ల మాద్యమం వారే ఉన్నారు. వీరందరికీ ఇప్పటికే ప్రాధమిక స్థాయి నుంచి ఆంగ్లంపై అవగాహన ఉంది. వైఎస్‌ తరువాత వచ్చిన పాలకుల్లో చిత్తశుద్ధి కొరవడి ఆంగ్లబోధన పటిష్టానికి చర్యలు చేపట్టలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ పరిస్థితిని అధిగమించే రీతిలో ప్రణాళికలు వేస్తోంది. 

బాబు హయాంలో 117 స్కూళ్ల మూసివేత 
చంద్రబాబు హయాంలో ప్రస్తుతం నడుస్తున్న సమాంతర ఆంగ్లమాద్యమ విధానాన్ని పూర్తి విస్మరించారు. పరోక్షంగా ప్రైవేటు విద్యావ్యవస్థను ప్రోత్సహించేలా వ్యవహరించి రేషనలైజేషన్‌ పేరుతో జిల్లాలో 117 పాఠశాలలను మూసేశారు. మున్సిపల్‌ మంత్రి నారాయణ తమ విద్యాలయాల్లోని అమలు చేసిన విధానాలను రుద్దారు. ‘కెరియర్‌ ఫౌండేషన్‌ కోర్సు(సీఎఫ్‌సీ), అద్వాన్స్‌ ఫౌండేషన్‌ కోర్సు(ఏఎఫ్‌సీ)లను ప్రవేశపెట్టి ఇంగ్లిష్‌ బోధనలను ప్రవేశ పెట్టారు. ఇందుకోసం రూ.లక్షలకు లక్షలు పెట్టి ప్రత్యేక పుస్తకాలను కూడా ముద్రించి విద్యార్థులకు అందజేశారు. అప్పుడు తప్పుకాదన్నవారు ఇప్పుడు ఇలా వాదించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాల వల్లే విద్యారంగం తిరోగమనం వైపు వెళ్లిందన్న విమర్శలూ వస్తున్నాయి. సంకల్పయాత్రలో వీటిని గుర్తించిన వై.ఎస్‌.జగన్‌మోహనరెడ్డి విద్యావిధానంలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టి, అమ్మ ఒడి, నాడు నేడు వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు.  

నమ్మకం పెరిగింది
కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి ఆంగ్లమాధ్యమంలో పది వరకు చదివాను. దానివల్ల ప్రస్తుతం పాలిటెక్నికల్‌ డిప్లమా ఆంగ్ల మాధ్యమ చదువులు సులవయ్యాయి. ఆ తరువాత ఉన్నత చదువులు చదవడానికి భయం పోయింది.  పాఠశాల స్థాయిలో ఆంగ్ల మాధ్యమం చదవడం వల్ల ఇష్టపడిన రంగంలో స్థిరపడగలననే నమ్మకం కలిగింది.  
– ఆరిపాక జ్యోతి, పాలిటెక్నికల్, నీలావతి, గంట్యాడ మండలం

ఇంటర్‌లో ఇంగ్లిష్‌ మీడియం శుభపరిణామం 
ప్రభుత్వ పాఠశాలల స్థాయిలో ఏర్పాటు చేసిన ఆంగ్ల మాధ్యమం వల్ల మంచి ఫలితాలే వస్తాయి. మరోవైపు తెలుగు సబ్జెక్టు బోధనల్లో మరింత పటిష్టత అవసరం. ఆ దిశగా పాఠ్యాంశాలు, బోధనా శైలిలో సంస్కరణలు రావాలి.  చదివిన పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ కోర్సులు పెట్టడం మంచి పరిణామమే.  – టి.సన్యాసిరాజు, ప్రధాన కార్యదర్శి, ప్రధానోపాధ్యాయుల సంఘం  
 

మరిన్ని వార్తలు