ఫీజుల పథకానికి ‘ఆధార్’ దెబ్బ

16 Aug, 2013 01:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ‘ఆధార్’ గుదిబండగా మారింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు ఉండి తీరాలన్న నిబంధన విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తోంది. రెన్యువల్ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు గత నెల 27 నుంచి ఈ-పాస్ వెబ్‌సైట్‌లో అవకాశమివ్వగా, ఇప్పటి వరకు 10 వేల దరఖాస్తులే వచ్చాయి. ఆధార్ నిబంధన లేనప్పుడు 15 రోజుల వ్యవధిలో లక్షకు తగ్గకుండా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు పదో వంతు దరఖాస్తులైనా రాకపోవడం ఆందోళన కలిగిస్తోందని సంక్షేమ శాఖ అధికారులే అంటున్నారు. దరఖాస్తు చేసుకునే క్రమంలో విద్యార్థి ఆధార్ నంబర్‌ను రెండుసార్లు నమోదు చేయాలి.
 
 ఆ తర్వాత విద్యార్థి మొబైల్ నంబర్‌ను రెండుసార్లు నమోదు చేస్తే, మొబైల్‌కు వచ్చే పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తేనే దరఖాస్తు కనపడుతోంది. అంటే ‘ఆధార్’ లేకపోతే కనీసం దరఖాస్తు కూడా కనపడదు. అయితే, ఫీజుల పథకానికి దరఖాస్తు చేసుకునే వారిలో సగం మందికి పైగా విద్యార్థులకు ఆధార్ లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్‌ను తప్పనిసరి చేయడం విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తోంది. గతంలో పదో తరగతి వివరాలు నమోదు చేయగానే దరఖాస్తు కనపడేది.. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులు నిరాశ చెందుతున్నారు. కాగా, ‘ఆధార్’ నిబంధనపై ప్రభుత్వం కానీ, యాజమాన్యాలు కానీ విద్యార్థులను చైతన్యపరచలేకపోవడం, కళాశాలల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం కారణంగా ఈ ఏడాది చాలామంది ఫీజుల పథకానికి దూరమయ్యే అవకాశం ఉందని విద్యార్థి, కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆధార్‌తో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు